ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని తెచ్చిపెట్టారు. జావెలిన్‌త్రోలో అద్భుతమైన ప్రదర్శనతో ఆయన ఈ పతకాన్ని గెలిచారు.
మొదటి ప్రయత్నంలో ఆయన జావెలిన్‌ను 87.03 మీటర్లకు విసిరారు. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లకు విసిరారు. రెండో స్థానంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన వడ్లెక్ నిలిచారు. ఈయన గరిష్ఠంగా 86.67 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రీ-3లో 88.07 మీటర్లకు జావెలిన్‌త్రో విసిరి నీరజ్ తన సొంత జాతీయ రికార్డును తానే అధిగమించారు. అంజూ బాబీ జార్జ్ తరువాత అన్ని ప్రపంచ స్థాయి అథ్లెటిక్ పోటీల్లో స్వర్ణాలు గెలుచుకున్న భారతీయ అథ్లెట్ నీరజ్ మాత్రమే.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని తీసుకురావడంపై నీరజ్ చోప్రా మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.''టోక్యోలో చరిత్ర సృష్టించాడు. నేడు నీరజ్ సాధించిన విజయాన్ని భారత్ ఎప్పటికీ మరచిపోదు. యువ కెరటం నీరజ్ అద్భుతంగా విజయం సాధించాడు.
అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. బంగారాన్ని సాధించినందుకు అభినందనలు''అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు నీరజ్‌ను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. బాహుబలితో పోల్చారు. ''మేం అంతా నీ సైన్యంలో ఉన్నాం, బాహుబలి''అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.