జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా శనివారమైన తొలి రోజున భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మీరాభాయి చాను వెండి పతకాన్ని సాధించారు. హాకీలో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే, భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం సాయి ప్రణీత్ బ్యాడ్మింటన్ తొలి మ్యాచ్ లోనే ఓడిపోయారు.
శనివారం గ్రూప్-డి ఫురుషుల సింగిల్స్‌లో పోటీపడిన సాయి ప్రణీత్.. తన కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న ఇజ్రాయిల్ షట్లర్ మిశా జిబర్‌మాన్ చేతిలో ఓడిపోయాడు.17-21, 15-21 తేడాతో ఓటమిని చవిచూశాడు.
2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుపొందిన సాయి ప్రణీత్.. ప్రస్తుతం 15వ ర్యాంక్‌లో ఉన్నాడు. అయినప్పటికీ 47వ ర్యాంక్‌లో ఉన్న జిబర్‌మాన్‌కు ఎదురొడ్డి నిలబడలేకపోయాడు.
ఫలితంగా ఈ మ్యాచ్ కేవలం 41 నిమిషాల్లోనే ముగిసింది. ఒలింపిక్స్‌లో సాయి ప్రణీత్ పోటీపడటం ఇదే తొలిసారి. తన తదుపరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌కి చెందిన మార్క్‌తో సాయి ప్రణీత్ ఆడనున్నాడు. కాగా, మార్క్ ప్రస్తుతం 29వ ర్యాంక్‌లో ఉన్నాడు.