టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్‌లో పరాజయం పాలైన భారత షట్లర్ సింధు కాంస్య పతకంపై దృష్టిసారించింది. ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి చైనీస్ తైపీ తై జుతో హోరాహోరీగా జరిగిన సెమీస్ పోరులో సింధు వరుస సెట్లలో ఓటమి పాలైంది. తొలి సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ రెండో సెట్‌లో మాత్రం తై జు దూకుడు ముందు నిలవలేకపోయింది. ఫలితంగా 18-21, 12-21తో ఓటమి పాలైంది.
సింధు ఓడినప్పటికీ పతకం ఆశలు సజీవంగా ఉన్నాయి. చైనాకే చెందిన హి బింగ్జియావోతో రేపు (ఆదివారం) సాయంత్రం ఐదు గంటలకు కాంస్యం కోసం పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సింధు ఒలింపిక్స్‌లో మరో పతకాన్ని ముద్దాడినట్టే.
మ్యాచ్ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు తొలి విరామం తర్వాత వెనుకపడింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తై జు తర్వాత సింధూకు గట్టి పోటీ ఇచ్చింది. దాంతో తొలి గేమ్‌లో సింధు ఓటమిపాలైంది. ఆపై మరింత పట్టుదలగా ఆడిన తై జు రెండో గేమ్‌లోనూ ఏ అవకాశం ఇవ్వలేదు. చివరికి సింధు ఓటమిపాలవ్వక తప్పలేదు.
దీంతో సింధు గోల్డ్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే బ్రాంజ్ మెడల్ కోసం ఆమె రేపు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. 2016లో రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ సాధించిన సింధు టోక్యోలో మాత్రం కాంస్య పతకం కోసం పోటీపడనుంది.
ఇకపోతే... ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడిన 18 మ్యాచ్‌లలో, తైజు-యింగ్ సింధుపై 13-5 ఆధిక్యంలో ఉన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ, "నేను సంతోషంగా ఉన్నాను కానీ నేను తదుపరి మ్యాచ్ కోసం సిద్ధం కావాలి" అని చెప్పింది. తన కోచ్ మద్దతుతో తదుపరి మ్యాచ్‌కు సిద్ధం అవుతున్నానని తెలిపింది.