భారత బాక్సర్ విజేందర్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో మరోసారి విజేందర్ సింగ్ తన సత్తా ఏంటో చాటుకున్నాడు. ప్రత్యర్థులు మారినా విజేందర్ పంచ్‌లతో అదరగొడుతున్నాడు. తన ఆరో బౌట్‌లోనూ విజేందర్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. ప్రొ బాక్సింగ్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తూ ఆరో నాకౌట్ విజయంతో సత్తాచాటాడు.
శుక్రవారం జరిగిన ఎనిమిది రౌండ్ల పోరులోనూ విజేందర్ పోలెండ్ బాక్సర్ ఆంద్రెజ్ సోల్డ్రాను చిత్తు చేశాడు. ఈ బౌట్‌ను కూడా హర్యానా బాక్సర్ కేవలం పది నిమిషాలలోపే ముచ్చటగా మూడు రౌండ్లలోనే ముగించి ఔరా అనిపించాడు. దూకుడే మంత్రంగా విజేందర్ చెలరేగిపోయాడు.
ఆద్యంతం మెరుగ్గా రాణించాడు. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న విజేందర్ పంచ్‌లతో సోల్డ్రా కళ్ళు బైర్లు కమ్మేలా చేశాడు. అతను పోరాడలేక పక్కకు తప్పుకోవడంతో.. అంపైర్ బౌట్‌ను నిలిపి విజేందర్‌ను విజేతగా ప్రకటించాడు.