ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లడం ద్వారా చైనా ప్రత్యర్థి షియాన్ వాంగ్‌తో పోటీకి సై అంటోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-14, 21-18 పాయింట్ల తేడాతో థాయ్‌లాండ్ క్రీడాకారిణి నిచాన్‌పై గెలుపును నమోదు చేసుకుంది.
ఈ విజయం ద్వారా సైనా క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి, మూడో సీడ్ షియాన్ వాంగ్‌తో పోటీ పడనుంది. ఆద్యంతం మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన సైనా నెహ్వాల్.. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమైంది. దీంతో ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించి.. క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.
అయితే మహిళల సింగిల్స్ విభాగంలో మరో భారత క్రీడాకారిణి పీవీ సింధుకు ప్రిక్వార్టర్స్‌లో ఓటమి తప్పలేదు. సింధు 21-13, 20-22, 8-21తో తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. తద్వారా ఈ టోర్నీ నుంచి పీవీ సింధు నిష్క్రమించాల్సి వచ్చింది.