హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. తన కెరీర్‌లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్ ఒకుహరపై 21-19, 21-17 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించింది.
మొత్తం గంటా రెండు నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీలో సింధు పైచేయిగా నిలించింది. గతేడాది ఫైనల్ చేరినా సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్న సింధు.. ఈసారి మాత్రం టైటిల్ గెలవడం విశేషం. ఈ ఏడాది మొదటి నుంచీ సింధు టాప్ ఫామ్‌లో ఉంది. యమగుచి, తై జు యింగ్, రచనోక్‌లాంటి టాప్ ప్లేయర్స్‌పై వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన సింధు.. చివరి మ్యాచ్‌లోనూ అదే రేంజ్‌లో చెలరేగింది.
కాగా, బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ విజేత పీవీ సింధుకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించిన సింధుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. "నిన్ను చూసి గర్వపడుతున్నాం" అంటూ ట్వీట్ చేశారు.