టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధు శుక్రవారం విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు సింధుకు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ, ఒలింపిక్స్‌కు వెళ్లేముందు దుర్గమ్మను దర్శించుకున్నానని.. అమ్మవారి ఆశీస్సులతో పతకం గెలిచానని చెప్పారు.దుర్గమ్మ దర్శనానికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. 2024 ఒలింపిక్స్ సహా భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు ఆడాల్సి ఉందన్నారు.
ఒలింపిక్స్‌కు వెళ్లేముందు పతకంతో తిరిగి రావాలని సీఎం ప్రోత్సహించారని తెలిపారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతోషదాయకమని చెప్పారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పతకాల సాధనకు అవకాశం కలుగుతుందన్నారు. విశాఖలో తన అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించిందని.. త్వరలోనే ఏర్పాట్లు పూర్తి చేసి క్రీడాకారులకు శిక్షణ ఇస్తానని సింధు చెప్పారు.
దుర్గమ్మ దర్శనం అనంతరం ఏపీ సీఎం జగన్‌ను పీవీ సింధు కలిశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధును సీఎం అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.