'సిల్వర్' సింధూ.. నీ పోరాటం అద్భుతం : ప్రణబ్ - మోడీ - సోనియా ప్రశంసలు
రియో ఒలింపిక్స్ క్రీడల్లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన పి.వి.సింధుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అధినేత అమిత్ షా, పశ్చిమబెంగాల
రియో ఒలింపిక్స్ క్రీడల్లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన పి.వి.సింధుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అధినేత అమిత్ షా, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రశంసల వర్షం కురిపించారు.
సింధూ విజయంపై వారంతా వేర్వేరు ప్రకటనలో అభినందించారు. 'భారతీయులంతా నీ కుటుంబంలో ఒకరుగా నీ విజయానందాన్ని పంచుకుంటున్నారు' అని రాష్ట్రపతి అభినందించారు. ఇక సింధు అద్వితీయంగా పోరాడిందని, ఆమె సాధించిన విజయం చరిత్రాత్మకమని ప్రధాని మోడీ అభివర్ణించారు.
'సింధూ.. నీ విజయం చిరస్మరణీయం. నీకు నా అభినందనలు' అని మోడీ ట్వీట్ చేశారు. సింధు తన అసమాన ప్రతిభతో దేశంలోని యువ భారతీయులందరి కొత్త ఆశలు వెలిగించిందని సోనియా ప్రశంసించారు.
మహిళలకు సరైన అవకాశం లభిస్తే ఎంతటి ఘనత సాధించగలరో ఆమెతోపాటు సాక్షిమాలిక్, దీపా కర్మాకర్ జాతికి చాటిచెప్పారని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అన్నారు. 'సింధు అద్భుత ప్రదర్శన యువతకు స్ఫూర్తిదాయకం, దేశానికి సదా స్మరణీయం. జై హింద్' అని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రశంసించారు.