Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హకీంపేట స్పోర్ట్స్ హాస్టల్‌లో మరో బ్రిజ్‌భూషణ్... సస్పెన్షన్ వేటు!

Advertiesment
harikrishna
, ఆదివారం, 13 ఆగస్టు 2023 (11:21 IST)
హైదరాబాద్ నగరంలోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో మరో బ్రిజ్ భూషణ్ బయటపడ్డాడు. ఈ స్కూల్‌ విద్యార్థినిల(బాలికలు)పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆ అధికారి ఎవరో కాదు. ఓఎస్డీ హరికృష్ణ. ఈయన్ను సస్పెండ్ చేస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు జారీచేశారు. బాలికలు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. 
 
ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని, ఒకటి రెండు రోజుల్లోనే దోషులకు జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనలో అధికారులు, పార్టీ నేతలు, ఉద్యోగులు ఎవరు ఉన్నా సరే వదిలిపెట్టబోమని తెలిపారు. ఈ స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలు వైరల్ కావడంతో ఎమ్మెల్సీ కవిత స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తక్షణం స్పందించారు. అసలు ఈ స్కూల్‌లో ఏం జరిగిందో పరిశీలిస్తే, 
 
హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలు వివిధ ఆటల పోటీలకు సంబంధించి కోచింగ్ తీసుకుంటున్నారు. హాస్టల్‌లో ఉంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలికలు ఆరోపిస్తున్నారు. బాలికల హాస్టల్‌లోకి అధికారులైనా సరే రాత్రిపూట పురుషులు వెళ్లడం నిషేధం. అయితే, ఓఎస్డీ మాత్రం హాస్టల్ ఆవరణలోని గెస్ట్ హౌస్‌లోనే మకాం పెట్టారని బాలికలు చెప్పారు. 
 
సాయంత్రం పూట ఆటవిడుపు పేరుతో బాలికలలో కొంతమందిని బయటకు తీసుకెళుతున్నాడని, అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని వివరించారు. అర్థరాత్రి గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. హరికృష్ణకు ఓ మహిళా ఉద్యోగి సహా ముగ్గురు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. సదరు మహిళా ఉద్యోగితో ఓఎస్డీకి అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై వేధింపులకు సంబంధించిన ఆరోపణలపై ఓ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు సూచించారు. వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఓ హరికృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. 
 
కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై ఓఎస్టీ హరికృష్ణ స్పందిస్తూ సెలక్షన్ సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని, స్కూలుకు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వేలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హరికృష్ణ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ? విరాట్ కోహ్లీ? ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ ప్లేయర్ ఎవరో తెలుసా?