కన్నీళ్లు పెట్టుకున్న జకోవిచ్‌: స్విస్ స్టార్ వావ్రింకా అదుర్స్ విజయం

సోమవారం, 8 జూన్ 2015 (11:01 IST)
టెన్నిస్ దిగ్గజాలు ఫెదరర్, నాదల్, ముర్రేలను దాటుకుని వచ్చిన స్విస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా అద్భు విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తద్వారా కెరీర్ స్లామ్ సాధించాలన్న జకోవిచ్ కలలన్నీ కల్లలయ్యాయి. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో నాలుగు సెట్లలో సెర్బియా యోధుడు, 8 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న ప్రస్తుత నెంబర్ 1 జకోవిచ్‌ని వావ్రింకా మట్టి కరిపించాడు. 
 
గత సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నాదల్‍ను ఓడించి తొలి శ్లామ్ గెలుచుకున్న వావ్రింకాకు ఇది రెండో పెద్ద టైటిల్. ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో 4-6, 6-4, 6-3, 6-4తో జొకోవిచ్‌‌ను వావ్రింకా ఓడించాడు. 
 
కాగా, మర్రేతో సెమీస్‌ పోరు రెండు రోజులు సాగడం, విశ్రాంతి లేకుండా మూడో రోజు కూడా కోర్టులో ఫైనల్ ఆడడంతో, మ్యాచ్ ప్రారంభంలోనే జకోవిచ్‌లో అలసట కనిపించింది. జకోవిచ్ తప్పుపై తప్పు చేస్తూ వెళ్లగా, వాటిని వావ్రింకా తనకు అనుకూలంగా మార్చుకుని టైటిల్ గెలవడం గమనార్హం.
 
మ్యాచ్ అనంతరం జకోవిచ్ కన్నీరు పెట్టాడు. దీంతో అతని అభిమానుల కళ్లూ చెమ్మగిల్లాయి. ఓ అద్భుతమైన బ్యాక్ హ్యాండ్ షాటుతో చాంపియన్ షిప్ పాయింటును సాధించిన వావ్రింకా, మట్టి కోటలో కొత్త రారాజుగా అవతరించాడు.

వెబ్దునియా పై చదవండి