భారతదేశ బ్యాట్మింటన్ దిగ్గజం నందు నటేకర్ ఇకలేరు. 88 యేళ్ల వయసులో ఆయన కన్నుమూశారు వృద్ధాప్య కారణాలతో బుధవారం ఆయన సహజ మరణం చెందారు. గత మూడు నెలలుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
నందు నటేకర్‌ను దేశ తొలితరం బ్యాడ్మింటన్ దిగ్గజమని చెప్పడంలో ఎవరికీ సందేహం లేదు. 1956లో అంతర్జాతీయ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు ఆయనే కావడం గమనార్హం. కెరీర్లో ఆయన 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించారు. ఆయనకు ఒక కుమారుడు గౌరవ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 'ఆయన (నందు నటేకర్) ఇంట్లోనే సహజ మరణం చెందారు. మేమంతా ఆయన వెంటే ఉన్నాం. మూడు నెలలుగా ఆయన కాస్త నలతగా ఉంటున్నారు. మేమెంతగానో ప్రేమించే మా నాన్న నందు నటేకర్ 2021, జులై 28న కన్నుమూశారని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాం. కొవిడ్ నిబంధనల కారణంగా మేం ఎలాంటి సంతాప కార్యక్రమం ఏర్పాటు చేయడం లేదు. మీరంతా ఆయనను మనసులోనే స్మరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని పేర్కొన్నారు.
కాగా, మహారాష్ట్ర సంగ్లిలో జన్మించిన నటేకర్ 1961లో ఆయన అర్జున అవార్డు అందుకున్నారు. 1954 ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్స్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. 1956లో మలేసియాలో సెలాంజర్ ఇంటర్నేషనల్ సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.
1951-1963 మధ్య థామస్‌కప్‌లో భారత జట్టు తరఫున 16 సింగిల్స్‌లో 12, 16 డబుల్స్‌లో 8 గెలిచారు. 1959, 1961, 1963లో జట్టును నడిపించారు. 1965 కామన్వెల్త్ క్రీడల్లోనూ నందు నటేకర్ పాల్గొని ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.