బ్యాంకాక్ వేదికగా జరిగిన థామస్ కప్ పైనల్ పోటీల్లో భారత్ చరిత్ర సృష్టించింది. థామస్ కప్ విజేతగా ఆవిర్భవించింది. ఇప్పటివరకు 14 సార్లు విజేతగా నిలిచిన ఇండోనేషియాపై చారిత్రాత్మక విజయాన్ని భారత్ నమోదు చేసుకుంది. అద్భుత ఆటతీరుతో భారత ఆటగాళ్ళు తుదిపోరులో ఇండోనేషియాను ఊపిరి పీల్చుకోని విధంగా చేశారు. ఫలితంగా ప్రత్యర్థిపై 3-0 తేడాతో విజయభేరీ మోగించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత 20 యేళ్ళ యువ ఆటగాడు లక్ష్యసేన్ 8-21, 21-17, 21-16 తేడాతో ఒలింపిక్స్ రజత పతక విజేత ఆంథోనీపై గెలుపొందారు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంతో అందించాడు. ఆ తర్వాత డబుల్స్‌లో తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ 18-21, 23-21, 21-19తో మహ్మద్ అహసన్ - సంజయ సుకమౌల్జోపై గెలుపొందారు.
దీంతో ఇండోనేషియాపై 2-0 ఆధిక్యంతో భారత్ దూసుకెళ్లింది. ఈ రెండు గేముల్లోనూ తొలి సెట్‌ను కోల్పోయి మరీ విజయం సాధించడం విశేషం. ఇక ఆఖరి గేమ్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21 వరుస సెట్లలో జోనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించి 30 ఆధిక్యంతో థామస్ కప్‌ను కేవసం చేసుకున్నారు.