భారత అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష పుట్టిన రోజు. శనివారం ఉష జన్మదినం.. ఆమెకు 56వ పడిలోకి అడుగుపెట్టారు. పీటీ ఉష పుట్టినరోజును పురస్కరించుకుని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, కేంద్ర యువత, క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజిజుతో పాటు పలువురు క్రీడాకారులు, ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
'భారతీయ ట్రాక్ అండ్ పరుగుల రాణి పీటీ ఉష గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అద్భుతమైన విజయాలను చూస్తూ పెరిగినవాడిని నేను. భారతీయులుగా ఇది మాకు చాలా గర్వకారణం. యువతను ప్రోత్సహించడానికి మీరు అంకితభావంతో స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలి.' అని యువరాజ్ ట్వీట్ చేశాడు. అలాగే కిరణ్ రిజిజు పీటీ ఉషతో ఉన్న ఫొటోలను జత చేసి ట్వీట్ చేశారు.
కాగా, భారత అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష జూన్ 27, 1964లో జన్మించారు. ఈమె 1979 నుంచి భారతదేశం తరపున అథ్లెటిక్స్‌లో పాల్గొని దేశానికి పలు విజయాలను అందించారు. ఈమె కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీలో జన్మించింది. అందుకే ఈమెను పయోలి ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తుంటారు. 1986 సియోల్ ఆసియా క్రీడల్లో 4 బంగారు పతకాలు. ఒక రజత పతకం సాధించింది.
1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో కూడా 2 రజత పతకాలు సాధించింది. అర్జున అవార్డు, పద్మశ్రీ బిరుదు, పలు ఉత్తమ అథ్లెట్ అవార్డులను ఆమె సాధించింది. క్రీడా రంగంలో ఎన్నొ ఘనతలు సాధించి పీటీ ఉష రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.