ప్రపంచ హాకీ క్రీడలో విశిష్ట క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ సింగ్. హాకీ క్రీడలో భారత కీర్తిని సమున్నతంగా ఎగురవేసిన వ్యక్తి మేజర్ సింగ్. ఒలింపిక్ క్రీడా సంగ్రామంలో వరుసగా మూడుసార్లు హాకీ క్రీడలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడంలో మేజర్ సింగ్ పాత్ర అనిర్వచనీయం.
మేజర్ ధ్యాన్ చంద్ 1905, ఆగస్టు 29వ తేదీన ఉత్తర ప్రదేశ్ ప్రయాగలో జన్మించారు. సింగ్ తండ్రి ఆర్మీలో సుబేదార్‌గా పనిచేశారు. ధ్యాన్ చంద్ తండ్రి సుబేదార్ సోమేశ్వర్ దత్ సింగ్ ఆర్మీలో పనిచేస్తూనే హాకీ ఆడేవారు. ధ్యాన్ చంద్ సింగ్ కుటుంబం ఝాన్సీకి వచ్చింది. సోమేశ్వర్ దత్ సింగ్‌కు ముగ్గురు కుమారులు. వారి పేర్లు హవల్దార్ మూల్ సింగ్, మేజర్ ధ్యాన్ చంద్, రూప్ సింగ్‌లు. చదువులను పూర్తిచేసిన సింగ్ 16 ఏళ్ల చిరు ప్రాయంలోనే భారత ఆర్మీలో చేరారు.
పంజాబ్ రెజిమెంట్‌లో సిపాయిగా ధ్యాన్ సింగ్ పనిచేసేవారు. ధ్యాన్ చంద్‌కు హాకీ క్రీడలో ఉన్న ఆసక్తి, మెలకువలను బ్రాహ్మిణ్ రెజిమెంట్‌కు నేతృత్వం వహిస్తున్న సుబేదార్-మేజర్ భోలే తివారీ గుర్తించారు.
ధ్యాన్ చంద్ క్రీడా పాఠవాన్ని గుర్తించిన భారత హాకీ సమాఖ్య 1928 ఒలింపిక్ క్రీడలకు ఎంపిక చేసింది. 1928 వేసవి ఒలింపిక్ క్రీడలకు వేదిక ఆమస్టర్‌డామ్. ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య నెదర్లాండ్స్‌ను 3-0 గోల్స్ తేడాతో భారత్ ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవటంలో ధ్యాన్ చంద్ పాత్ర అనిర్వచనీయం. ఫైనల్ మ్యాచ్‌లో ధ్యాన్ చంద్ రెండు గోల్స్ చేసి జట్టును విజయపథాన నడిపించాడు.
అమెరికా పశ్చిమ ప్రాంత నగరమైన లాస్ ఏంజిల్స్ వేదికగా 1932 ఒలింపిక్ క్రీడల్లో ధ్యాన్ చంద్ మాయాజాలంతో భారత్ మరోసారి స్వర్ణ పతకాన్ని అందుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్‌ను 23-1 గోల్స్ తేడాతో భారత్ చిత్తు చేసింది. ఇందులో 8 గోల్స్ ధ్యాన్ చంద్ చేశారు.
భారత జట్టు 1935లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సమయంలో ధ్యాన్ చంద్ ఒక్కరే 201 గోల్స్ చేశారు. భారత జట్టు మొత్తం 43 మ్యాచ్‌లు ఆడి 584 గోల్స్ చేసింది. 1936లో జర్మనీ రాజధాని బెర్లిన్ వేదికగా ఒలింపిక్ క్రీడలు జరిగాయి.
ఆతిథ్య జర్మనీ జట్టును 8-1 గోల్స్ తేడాతో భారత్ పరాజయం పాల్జేసి ముచ్చటగా మూడోసారి స్వర్ణ పతకాన్ని అందుకుంది. ఇందులో ధ్యాన్ చంద్ ఆరు గోల్స్ చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. హాకీ క్రీడ నుంచి ధ్యాన్ చంద్ 1948లో రిటైర్మెంట్ అయ్యారు. భారత ప్రభుత్వం 1956లో ధ్యాన్ చంద్‌కు పద్మ భూషణ్ అవార్డును ప్రదానం చేసింది.
రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచ దేశాలను గడగడలాడించిన జర్మనీ అధినేత అడాల్ఫ్ హిట్లర్ ధ్యాన్ చంద్‌ను తనింటికి ఆహ్వానించారు. జర్మనీ దేశం తరపున ఆడటానికి ఏమి తీసుకుంటావని ధ్యాన్ చంద్‌ను ప్రశ్నించారు. దానికి తాను భారతీయుడని, దేశం కోసం మాత్రమే ఆడతానని ధ్యాన్ చంద్ వినమ్రంగా జవాబిచ్చారు.
భారత జట్టు ఒలింపిక్ క్రీడలలో 175 గోల్స్ చేయగా అందులో ధ్యాన్ చంద్ 59 గోల్స్ చేశాడు. హాకీ ఫీల్డ్‌లో ధ్యాన్ చంద్‌ను అందరూ ముద్దుగా విజార్డ్ ఆఫ్ హాకీగా పిలుస్తారు. ధ్యాన్ చంద్ 1979 డిసెంబరు 3వ తేదీన కన్నుమూశారు.
ధ్యాన్ చంద్ సేవలను గుర్తుంచునే విధంగా న్యూఢిల్లీ నేషనల్ స్టేడియం ముందు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో కూడా ధ్యాన్ చంద్ విగ్రహాన్ని ఆ నగర వాసులు ఏర్పాటు చేశారు.
ధ్యాన్ చంద్ హాకీకి చేసిన సేవలను గుర్తుంచుకునే విధంగా ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడల దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా ఆరోజున వివిధ క్రీడల్లో మెరుగైన ప్రతిభను కనబరిచిన వారికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డులను రాష్ట్రపతి భవన్‌లో వారికి ప్రదానం చేస్తారు.