స్పెయిన్ యువ కెరటం రఫెల్ నాదల్ ప్రపంచ టెన్నిస్ క్రీడలో సంచనాలు నమోదుచేస్తూ అభిమానుల మనసు దోచుకుంటున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను వరుసగా మూడుసార్లు కైవసం చేసుకుని నాదల్ రికార్డు సృష్టించాడు. స్పెయిన్‌లోని మనాకోర్‌లో 1986 జూన్ 3వ తేదీన నాదల్ జన్మించాడు. నాదల్ 12వ ఏట తర్వాత టెన్నిస్‌లో రాణించాలని ఉబలాటపడ్డాడు.
నాదల్ 15ఏళ్ల ప్రాయంలోనే 2002లో జరిగిన ఏటీపీ తొలి టైటిల్‌ను గెలుచుకుని రికార్డు సృష్టించాడు. 16వ ఏటలోపు ఏటీపీ టైటిళ్లను గెలుచుకున్న వారి జాబితాలో 9వ వాడు నాదల్. 2003లో అతిపిన్న వయస్సులో టాప్100 జాబితాలో స్థానం సంపాందించిన చిన్నోడు రఫెల్ నాదల్. 2003 చివరి నాటికి టాప్50లో స్థానం సంపాదించాడు.
2005లో జరిగిన మియామీ మాస్టర్స్ టోర్నీ, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రాణించి నాదల్ ముందంజ వేశాడు. ఇదే ఏడాది వరుసగా 24 మ్యాచ్‌లు గెలిచి నాదల్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు అమెరికా క్రీడాకారుడు అగస్సీ పేరున ఉంది. అగస్సీ 1988లో వరుసగా 23 మ్యాచ్‌లు గెలిచాడు. ఇదే ఏడాది చివరి నాటికి టాప్5లో నాదల్ స్థానం సంపాదించాడు.
నాదల్ కెరీర్‌లో తొలిసారి 2005 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడాడు. సెమీస్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్‌వన్ ధిగ్గజం రోజర్ ఫెదరర్‌ను మట్టికరిపించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అర్జెంటీనాకు చెందిన మరియానో ప్యూర్టాను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను అతిపిన్న వయస్సులో అందుకున్న వారిలో నాదల్ నాలుగోవాడు. గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో తొలిసారి ప్రవేశంతోనే టైటిల్‌ను చేజిక్కించుకున్న వారిలో ఏడోవాడు నాదల్.
రఫెల్ నాదల్ 19 ఏళ్ల చిరుప్రాయంలోనే ప్రపంచ నెంబర్‌టూ స్థానానికి ఎదిగాడు. అంతకుముందు బోరిస్ బెకర్, బోజర్న్ బోర్గ్‌లు 18 ఏళ్ళ ప్రాయంలో ఈ రికార్డు సృష్టించారు. నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా 2005, 06, 07 టోర్నీలలో గెలుపు సాధించి హ్యాట్రిక్ కొట్టాడు. ఇందులో రెండుసార్లు ఫెదరర్‌ను ఓడించటం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రం సెమీస్ (2008) లో తిరుగుముఖం పట్టాడు. వింబుల్డన్ టోర్నీ ఫైనల్స్‌లో తన అసలైన ప్రత్యర్ధి ఫెదరర్ చేతిలో వరుసగా 2006, 2007లలో నాదల్ పరాజయం చవిచూశాడు.
గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోకి నాదల్ ఐదు సార్లు ప్రవేశించగా మూడుసార్లు విజేతగానూ, రెండుసార్లు రన్నరప్‌గా నాదల్ నిలిచాడు. ఏటీపీ టైటిళ్లు 11, డబుల్స్‌లో నాలుగుసార్లు నాదల్ జయభేరి మోగించాడు. రఫెల్ నాదల్ ప్రస్తుతం ప్రపంచ నెంబర్‌టూ క్రీడాకారుడుగా కొనసాగుతున్నాడు.