స్వదేశంలో జరుగనున్న టెన్నిస్ టోర్నీలో తాను ఆడబోనని భారత టెన్నిస్ ఏస్ సానియా మీర్జా చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 'ఆటకంటే వ్యక్తిగతానికే సానియా మీర్జా అధిక ప్రాధాన్యత' ఇస్తున్నారని పలువురు క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు బెంగుళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నీ జరుగనుంది. ఇందులో అమెరిగా అగ్రశ్రేణి క్రీడాకారిణి వీనస్ విలియమ్స్‌తో పాటు.. ఆస్ట్రేలియా యువకెరటం సిబాలా మరికొందరు విదేశీ టెన్నిస్ తారలు పాల్గొననున్నారు. అయితే సానియా మీర్జా మాత్రం తొడ గాయాన్ని సాకుగా చూపి ఈ టోర్నీకి దూరమైంది.
దీనిపై ఆమె తాజాగా విలేకరులతో మాట్లాడుతూ.. స్వదేశంలో జరిగే టోర్నీల్లో పాల్గొనడం వల్ల ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాని పేర్కొంది. దీనివల్ల కోర్టులో దిగినపుడు ఆటపై మనస్సును లగ్నం చేయలేక పోతున్నానని అందువల్ల ఈ టోర్నీకి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. అయితే సానియా నిర్ణయం వెనుక మరొక కారణం కూడా వుంది. బెంగుళూరు ఓపన్‌లో వీనస్ విలియమ్స్ పాల్గొనడం సానియాకు ఏ మాత్రం రుచించలేదు. ఇప్పటి వరకు ఆమెతో మూడు సార్లు తలపడగా.. మూడు దఫాలు సానియా పరాజయం పాలైంది.
ఇదే కథ బెంగుళూరు ఓపెన్‌లోను పునరావృత్తం అవుతుందని భావించడం వల్లే సానియా తొడగాయాన్ని సాకుగా చూపి టోర్నీకి దూరమైనట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే సానియా తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా భారత డెవిస్ కప్ కెప్టెన్ లియాండర్ పేస్ మాత్రం తీవ్రంగా తప్పుపట్టారు. దేశం తరపున ఆడటం అంటే అత్యంత గౌరవంగా భావించాలి. ఇక్కడ వ్యక్తుల కంటే.. క్రీడ గొప్పది. క్రీడాకారుని జీవితంలో ఒడిదుడుకులు సర్వసాధారణం. వీటిని ఎదురొడ్డి ముందుకు వెళ్లినవారే నిజమైన ఛాంపియన్లని పేస్ వ్యాఖ్యానించాడు.
ఇటీవలి కాలంలో సానియా రెండు మూడు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెల్సిందే. హైదరాబాద్‌లోని మక్కా మసీదులో అనుమతి లేకుండా ప్రవేశించడం, హోబర్ట్ టెన్నిస్ టోర్నీలో జాతీయపతాకాన్ని అగౌరపరిచే విధంగా కూర్చోవడం వంటి సంఘటనలు సానియాను వివాదంలోకి తీసుకెళ్లాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వుండేందుకు టోర్నీ నుంచి దూరంగా వుంటున్నట్టు సానియా మీడియాకు తెలిపింది.