లండన్ వేదికగా నిర్వహించే వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ మహిళా ధిగ్గజం మార్టినా నవ్రతిలోవా. ఐరోపాలో చిన్నదేశానికి చెందిన మహిళ నవ్రతిలోవా ప్రపంచ టెన్నిస్ క్రీడను శాసించటం విశేషం. మార్టినా నవ్రతిలోవా చెకోస్లొవేకియాలోని ప్రేగ్ నగరంలో 1956, అక్టోబరు 18వ తేదీన జన్మించింది.
నవ్రతిలోవా 15ఏళ్ల ప్రాయంలోనే చెకోస్లొవేకియా జాతీయ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నీని 1972లో కైవసం చేసుకుంది. ప్రొఫెషనల్ కెరీర్‌లో తొలిసారిగా ఫ్లోరిడాలోని ఆర్లండోలో జరిగిన బార్నెట్ బ్యాంక్ క్లాసిక్ టైటిల్‌ను నవ్రతిలోవా అందుకుంది. ఆ తర్వాత టెన్నిస్‌లో రాణిస్తూ 1975 నాటికి మెరుగైన క్రీడాకారిణి అయింది. ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లలో వరుసగా నవ్రతిలోవా పరాజయం పాలైంది.
యూఎస్ ఓపెన్ సెమీస్ వరకూ వచ్చి నవ్రతిలోవా భంగపడింది. గ్రాండ్‌స్లామ్ గెలుపు అనే కలను నవ్రతిలోవా 1978లో పూర్తిచేసుకుంది. అమెరికా తార, అప్పటి ప్రపంచ నెంబర్‌వన్ క్రీడాకారిణి క్రిస్ ఎవర్ట్‌పై వరుసగా మూడు సెట్లలో నవ్రతిలోవా జయభేరి మోగించింది. టైటిల్‌తో పాటుగా ప్రపంచ నెంబర్‌వన్ స్థానాన్ని నవ్రతిలోవా కైవసం చేసుకుంది.
నవ్రతిలోవా 18 గ్రాండ్‌స్లామ్, 31 గ్రాండ్‌స్లామ్ ఉమెన్స్ డబుల్స్, 10 గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లను అందుకుంది. వింబుల్డన్ ఫైనల్స్‌కు వరుసగా తొమ్మిదిసార్లు నవ్రతిలోవా ప్రవేశించింది. సింగిల్స్‌లో 167, డబుల్స్ విభాగంలో 177 టైటిళ్లను కైవసం చేసుకుని నవ్రతిలోవా తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. నవ్రతిలోవా 74 వారాలాపాటు ఆడిన మ్యాచ్‌లలో పరాజయం ఎదుర్కొనలేదు.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 1981, 1983, 1985, ఫ్రెంచ్ ఓపెన్‌లో 1982, 1984, వింబుల్డన్‌లో 1978, 1979, 1982-87, 1990, యూఎస్ ఓపెన్‌లో 1983, 1984, 1986, 1987లలో నవ్రతిలోవా జయభేరి మోగించింది. వింబుల్డన్‌లో వరుసగా ఆరేళ్లు టైటిల్‌ను కైవసం చేసుకుని తనదైన రికార్డును సొంతం చేసుకుంది.
నవ్రతిలోవాకు 1987లో స్టెఫీ గ్రాఫ్ రూపంలో గట్టి ప్రత్యర్ధి ఎదురైంది. అక్కడినుంచి అన్ని గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లలో స్టెఫీ ఎదురవడంతో నవ్రతిలోవా వెనుకంజ వేయాల్సి వచ్చింది. 1988లో జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల ఫైనల్స్‌లో నవ్రతిలోవాను ఓడించి స్టెఫీ కైవసం చేసుకుంది. నవ్రతిలోవా 1994లో సింగిల్స్, 2006లో డబుల్స్ విభాగం నుంచి తప్పకుంది.