ఆస్ట్రియా-స్విస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన యూరో 2008 మూడో రోజునే సాకర్ ధిగ్గజ జట్లు పరాజయం పాలయ్యాయి. దీనితో చిన్నపాటి జట్లు ఈ టోర్నీలో ఎంత బాగా ఆడుతున్నాయో అభిమానులకు అప్పుడే అర్ధమైపోయింది. ప్రపంచ కప్ 2006 ఛాంపియన్ ఇటలీ సోమవారం జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలై అభిమానులను నిరాశకు గురిచేసింది.
ప్రపంచ ఛాంపియన్ ఇటలీ నిరాశజనక ఆటతీరుతో 3-0 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలైంది. కెప్టెన్ ఫాబియో కన్నావారా గాయంతో తప్పుకోవడంతో ప్రత్యర్ధి హాలెండ్‌కు విజయం తేలికైంది. హాలెండ్ క్రీడాకారులు బాల్‌పా పట్టు సాధిస్తూనే మ్యాచ్ తొలి అర్ధ భాగంలో రెండు గోల్స్ చేసి ఇటలీని కష్టాల్లో పడేశారు.
హాలెండ్ క్రీడాకారులు నిస్టెల్‌రూయ్ (26 ని.), స్నెజిదర్ (31ని.) లు గోల్స్ చేసి జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. మలి అర్ధ భాగంలో బ్రోంక్‌హోరస్ట్ 79వ నిమిషంలో మూడో గోల్ చేసి జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లో ఇటలీ ఆటతీరు అభిమానులను నిరాశకు మిగిల్చింది.
ప్రపంచ ఛాంపియన్ల హోదాకు తగ్గట్టుగా ఆడుతున్నామా అన్న అనుమానం ఇటలీ క్రీడాకారులకు కలుగుతుంది. జట్టు ఇకనైనా మేలుకోకపోతే రొమేనియా, 2006 ప్రపంచ కప్ ఫైనలిస్ట్ ఫ్రాన్స్ చేతిలో పరాభవం ఎదుర్కొని ఇంటి దారి పట్టాల్సి ఉంటుంది ఇటలీ.
రొమేనియా జట్టు క్రీడాకారులు మేటి తారల అనుభవం లేకపోయినా ప్రపంచ జట్ల జాతకాలను యూరో 2008లో మార్చగలమన్న నమ్మకం వారికి ఏర్పడింది. 2006 ప్రపంచ కప్ ఫైనలిస్ట్ ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వారిని గోల్ చేయకుండా అడుగడుగునా అడ్డుకుంది రొమేనియా.
ఫ్రాన్స్ క్రీడాకారులు తమ ఆటతీరుకు భిన్నంగా నింపాదిగా ఆడుతుండటం రొమేనియాకు కలిసివచ్చింది. దీనితో ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ నమోదు కాకుండా డ్రాగా ముగిసింది. యూరో 2008 టోర్నీ టైటిల్ అందుకునే జట్ల జాబితాలో రొమేనియా కూడా చేరింది.
జర్మనీ యూరో కప్ ఓటమి భయాల నుంచి ఎట్టకేలకూ భయటపడింది. జర్మనీ జట్టు ఫార్వార్డ్ ప్లేయర్‌గా పొడోస్కీ కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మ్యాచ్ 20, 72 నిమిషాల్లో పొడోస్కీ గోల్స్ చేసి జట్టు విజయతీరాలకు చేర్చాడు. పొడోస్కీ ప్రత్యర్ధి పోలాండ్ దేశానికి చెందిన వాడు కావటం గమనార్హం. 2006 ప్రపంచ కప్‌లో లుకస్ పొడోస్కీ యువ క్రీడాకారుడుగా అవార్డును కైవసం చేసుకున్నాడు.