ఆస్ట్రియా-స్విస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న యూరో 2008 సాకర్ కప్ క్వార్టర్ ఫైనల్లోకి టర్కీ ప్రవేశించింది. చెక్ రిపబ్లిక్ ఆశలను వమ్ముచేస్తూ టర్కీ విజయం సాధించింది. మ్యాచ్ తొలి అర్ధ భాగంలో చెక్ బాగా రాణించి టర్కీ జట్టుకు చెమటలు పట్టించింది. చెక్ క్రీడాకారులు కోలర్ (34 ని.), ప్లాసిల్ (62 ని.) లు గోల్స్ చేసి జట్టు ఆధిక్యాన్ని పెంచారు.
టర్కీ క్రీడాకారుల దాడులను చెక్ ఆటగాళ్లు సమర్ధంగా తిప్పికొట్టారు. అయితే టర్కీ జట్టు మలి అర్ధ భాగం చివరి సమయంలో పుంజుకుని దాడులకు తెగబడింది. ఈ సమయంలో అర్దా తురాన్ (75 ని.), నిహాట్ కాచేవి (87 ని., 89 ని.) లు గోల్స్ చేసి జట్టును విజయం దిశగా నడిపించారు.
చెక్ రిపబ్లిక్ తొలి అర్ధ భాగంలో చూపించిన తెగువ మలి అర్ధ భాగంలో కొనసాగించలేకపోయింది. చెక్ క్రీడకారులు విజయంపై ధీమా ఉండటంతో టర్కీ ఆటగాళ్లు అందివచ్చిన అవకాశాన్ని దొరకబుచ్చుకుని వ్యూహాత్మక దాడులకు దిగారు. దీనితో చెక్ జట్టు వారిని నిలువరించటంలో విఫలం అయింది. గ్రూప్ ఎ విభాగం నుంచి పోర్చుగల్, టర్కీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాయి.
ఆతిథ్య జట్టు స్విట్జర్లాండ్ ఎట్టకేలకూ టోర్నీలో విజయం సాధించింది. టోర్నీలో ఎదురులేకుండా ముందుకు సాగుతున్న ప్రత్యర్ధి పోర్చుగల్‌కు స్విస్ తొలి విజయంతో షాకిచ్చింది. స్విస్ జట్టు మ్యాచ్ ఆరంభం నుంచి బంతిపై పట్టు నిలుపుకుంటూనే పోర్చుగల్‌కు నిలువరించింది. మ్యాచ్ తొలి అర్ధ భాగంలో రెండు జట్లూ ఒక్క గోల్ చేయకుండా అభిమానులను నిరాశపరిచాయి. అయితే మలి అర్ధ భాగంలో హకాన్ యాకిన్ (71 ని.), పెన్ (83 ని.) లు గోల్స్ చేసి స్విస్‌ను విజయపథాన నడిపారు.