టెన్నిస్ క్రీడా ప్రపంచంలో త్రివర్ణపతాకానికి ఓ గుర్తింపు తెచ్చిన క్రీడాకారిణి సానియా మీర్జా. తన ఏస్‌లతో ప్రత్యర్థులను గడగడలాడించే ఈ హైదరాబాద్ టీనేజ్ సంచలనం తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. మక్కా మసీదు ఆవరణంలో టెన్నిస్ తార సానియా మీర్జాపై తీసిన షూటింగ్ వివాదం ముదిరిపాకాన పడింది. ఒక ముస్లిం యువతిగా మక్కా పవిత్రతను కాపాడాల్సిన సానియా.. డబ్బుకోసం ఆ మసీదు అపవిత్రం చేసిందని ముస్లీం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనను మక్కా మసీదు ఆవరణలో సానియాపై సదరు వాణిజ్య కంపెనీ చిత్రీకరించింది. మక్కా మసీదులో ఫొటోలు, వీడియో షూటింగ్‌లను ఎపుడో నిషేధించారు. కాని మక్కా మసీదు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సానియా షూటింగ్‌లో పాల్గొనడం ఆమె వివాదంలో చిక్కుకునేలా చేసింది. ముఖ్యంగా.. మసీదులో ఆధునిక దుస్తులు ధరించి షూటింగ్ తీసిన అంశం ముస్లిం వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అనుమతి లేకుండా షూటింగ్ తీయడంపై మసీదు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ముస్లీం సంఘాలు, మసీదు సీనియర్ అధికారులు అంటున్నారు. షూటింగ్‌కు స్థానిక పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించడం సైతం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఈ విషయంలో వివరణ కోరుతూ సోమవారం విధినిర్వహణలో ఉన్న సిబ్బందికి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
సానియా మీర్జాతో పాటు షూటింగ్ తీసిన వారిపై కేసులు నమోదు చేసి శిక్షించాలని మజ్లిస్‌తో పాటు ఎంబిటి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మక్కా మసీదులో షూటింగ్ సంఘటనపై కఠినంగా వ్యవహరించాలని దక్షిణ మండలం డీసీపీ.శివధర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించినట్టు ఎంబిటి నాయకులు అంజదుల్లాఖాన్ చెప్పారు.