కురచ దుస్తులను వేసుకుని ఆటతో పాటు అందాలను పంచిపెట్టే విలియమ్స్ సిస్టర్స్.. ఒక్కసారిగా భారతీయ సంస్కృతిలో ఒదిగిపోయారు. బెంగుళూరు ఓపెన్‌లో పాల్గొంటున్న ఈ సిస్టర్స్ చీరకట్టి తమ అందాలను ప్రదర్శించారు. బెంగుళూరు ఓపెన్ టెన్నీస్ టోర్నీ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వీనస్-సెరీనాలు భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీర కట్టారు.
అంతేకాకుండా చీర కట్టులో తమ అందాలను చూసి మురిసి పోవడమే కాకుండా ఏకంగా ఫోటోలకు ఫోజులిచ్చారు. చీరచాటునదాగిన అమెరికా టెన్నిస్ భామల అందాలను చిత్రీకరించేందుకు బెంగుళూరు మీడియా ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. దీంతో ఆ ప్రాంతమంతా విద్యుత్ దీప కాంతలకు బదులుగా కెమరా ఫ్లాష్‌లతో దేదీప్యమానంగా వెలిగింది.
ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఈ టోర్నీలో వీరిద్దరితో పాటు వివిధ దేశాల టెన్నిస్ భామలు పోటీ పడుతున్నారు. అయితే భారత టెన్నిస్ తార సానియా మీర్జా మాత్రం ఈ టోర్నీకి దూరమైంది. స్వదేశంలో జరిగే టోర్నీల్లో పాల్గొనడం వల్ల వివాదాల్లో చిక్కుకుంటున్నానని, అందువల్ల ఈ టోర్నీకి దూరంగా వుండాలని నిర్ణయం తీసుకుంది. ఇది దేశ వ్యాప్తంగా పెద్ద వివాదాస్పదమైన విషయం తెల్సిందే.