టెన్నిస్ క్రీడలో రష్యా కీర్తి ప్రతిష్టలను సమున్నత శిఖరాలపై నిలిపిన తార మరియా షరపోవా. మహిళా టెన్నిస్ విభాగంలో రష్యా రమణి మరియా షరపోవా ప్రపంచ నెంబర్‌వన్ తారగా ప్రస్తుతం కొనసాగుతోంది. డబ్ల్యూటీఏ ర్యాంకుల్లో షరపోవా వరుసగా నాలుగేళ్లపాటు టాప్ టెన్‌లో కొనసాగుతూ వస్తోంది.
మహిళా టెన్నిస్ విభాగంలో షరపోవా కాకుండా మరే తార ఇంతకాలం టాప్ టెన్‌లో కొనసాగిన దాఖలాలు లేవు. అలాగే మహిళా అథ్లెట్‌గా అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న ఘనత షరపోవాకే సొంతం. 21ఏళ్ల షరోపోవా 1987, ఏప్రిల్ 19వ తేదీన రష్యాలోని న్యాగాన్‌లో జన్మించింది. షరపోవా అసలు పేరు మరియా యుర్వేనా షరపోవా. షరపోవాను ముద్దుగా మాషాగా పిలుస్తారు.
షరపోవా లేతప్రాయంలోనే 2004లో జరిగిన వింబుల్డన్ ఫైనల్లో అమెరికా అగ్రతార సెరీనా విలియమ్స్‌ను ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2006లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో జస్టిన్ హెనిన్‌ను ఓడించి టైటిల్‌ను షరోపోవా ఎగురేసుకు పోయింది. తాజాగా 2008లో ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో అనా ఇవనోవిచ్‌ను ఓడించి టైటిల్‌తో పాటుగా ప్రపంచ నెంబర్‌వన్ తారగా షరపోవా నిలిచింది.
షరోపోవా ఇప్పటివరకూ 19 టైటిళ్లను అందుకుంది. షరపోవా అన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకుప్పటికీ ఫ్రెంచి ఓపెన్‌ను మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. షరపోవా 2001 నుంచి ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా మారింది. 2003లో అత్యుత్తమంగా 32వ ర్యాంకులో షరపోవా నిలిచింది. ఇదే ఏడాదిలో జరిగిన వింబుల్డన్ పోటీల్లో నాల్గవ రౌండు వరకూ షరపోవా ఆడింది. 2004లో జరిగిన వింబుల్డన్ ఫైనల్లో అమెరికా తార సెరీనాను ఓడించి షరపోవా తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఎగురేసుకు పోయింది.
వింబుల్డన్ టైటిల్‌ను తొలిసారి అందుకున్న రష్యా మహిళగా షరపోవా రికార్డు నెలకొల్పింది. 2004లో షరపోవా 4వ స్థానంలో నిలిచింది. షరపోవా 2003-08 మధ్య అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ప్రముఖ కంపెనీలైన కానన్, కోల్గోట్, గాటోరేడ్, లాండ్‌రోవర్, నైక్, ప్రిన్స్ స్పోర్ట్స్, సోనీ ఎరిక్‌సన్ వంటి కంపెనీలు షరోపోవాకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. 2007లో ఐక్యరాజ్య సమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా షరోపోవా ఎంపికైంది.