భారత దేశంలోనే కాదు.. ఆగ్నేయాసియాలోను బెంగుళూరు ఓపెన్ టోర్నమెంటు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. కర్ణాటక రాష్ట్ర లాన్ టెన్నిస్ సంఘం (కేఎస్ఎల్‌టీఏ) ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తారు. ఈ టోర్నీ సుమారు 600,000 అమెరికా డాలర్ల ప్రైజ్ మనీతో నిర్వహించి... విజేతకు 95,500 అమెరికా డాలర్లను అందజేస్తారు.
వాస్తవానికి 2003లో తొలి సారి ఈ ఓపెన్ టోర్నీని హైదరాబాద్‌లో నిర్వహించారు. అయితే ఆ తర్వాత ఈ టోర్నీ స్పాన్సర్ సోనీ ఎరిక్సన్ ఇంటర్నేషనల్ సంస్థ బెంగుళూరుకు 2006లో మకాం మార్చింది. ప్రాధమిక దశలో టైర్ త్రీ స్థాయిలో ప్రారంభమైన ఈ పోటీలను ఆ తర్వాత కాలానుగుణంగా టైర్-టూ స్థాయికి పెంచి మహిళా టెన్నిస్ టోర్నమెంటుగా (డబ్ల్యూటీఏ) నిర్వహిస్తున్నారు.
గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న ఈ పోటీలు ఈ ఏడు కూడా కేఎస్ఎన్‌టీఏ సిగ్నేచర్ కింగ్‌ఫిషర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. 2007లో జరిగిన పోటీల్లో సింగిల్స్ విభాగంలో జరిగిన టైటిల్ పోరులో ఇటలీకి చెందిన టాప్ సీడెడ్ క్రీడాకారిణి మారా శాంటాంజెలాపై 6-4, 6-4 తో 19 ఏళ్ల రష్యా టీనేజర్ యారోస్లావా ష్విడోవా జయకేతనం ఎగురవేసి సంచలనం సృష్టించడంతో టోర్నీ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
భారత్‌లో టెన్నిస్‌కు నానాటికి ఆదరణ పెరుగుతున్న కారణంగా త్వరలోనే ఆసియాలో ఖతార్ ఓపెన్, దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటుల తర్వాత స్థానంలో బెంగుళూరు ఓపెన్ ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పోటీల్లో ఇప్పటి వరకు అనేక మంది ప్రపంచ టాప్ ర్యాంకు క్రీడాకారిణిలు పాల్గొన్నారు. ఈ ఏడు కూడా ప్రపంచ టాప్ ర్యాంకు క్రీడాకారిణిలు పాల్గొంటుండటంతో ఈ టోర్నీ విలువ మరింత పెరగనుంది. అమెరికా సోదరిణిలు వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్‌లు హాట్ ఫేవరేట్‌లుగా బరిలోకి దిగుతున్నారు.
టోర్నీ నిర్వాహకులు సుందర్ రాజు మాట్లాడుతూ ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు మంచి అనుభవాన్ని సంపాదిస్తారని తెలిపారు. ఈ టోర్నీ భవిష్యత్తులో ప్రపంచంలోనే ప్రతిష్టాక్మంగా మారి అత్యుత్తమ ర్యాంకు క్రీడకారిణిలకు ఆసక్తి రేకెత్తించేదిగా ఎదగేందుకు తాము కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. మార్చి 3 నుంచి 9 వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు భారత సంచలన క్రీడాకారిణి సానియా మీర్జా... ఆటకు సరైన న్యాయం చేయలేక పోతున్నానని.. కనుక ఈ ఏడు బెంగుళూరు ఓపెన్‌లో తాను పాల్గొనటం లేదని ప్రకటించడం గమనార్హం. 2005లో జరిగిన బెంగుళూరు ఓపెన్‌లో ఉక్రెయిన్ క్రీడాకారిణి అలోనా బొండారెంకోపై 6-4, 5-7, 6-3 తేడాతో సానియా గెలుపొంది సంచలనం సృష్టించడం విశేషం.