సెర్బియాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి మోనికా సెలెస్ పిన్న వయస్సులోనే ప్రపంచ నెంబర్‌వన్ తారగా ఎదిగి రికార్డు సృష్టించింది. మోనికా సెలెస్ 16ఏళ్ల ప్రాయంలోనే 1990లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అందుకుంది. హంగేరీకి చెందిన కుటుంబానికి మోనికా సెలెస్ యుగోస్లావియాలోని నోవి సాడ్‌లో 1973, డిసెంబరు 2వ తేదీన జన్మించింది. సెలెస్ ఆరేళ్ల ప్రాయంలో టెన్నిస్ బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. సెలెస్ ముద్దుపేరు మాలా మో. సెలెస్ 9ఏళ్ల వయస్సులోనే టైటిల్‌ను అందుకుంది. సెలెస్ 1988లో ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా మారింది.
1989 మేలో హోస్టన్ వేదికగా జరిగిన టోర్నీ టైటిల్ అందుకుంది సెలెస్. టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో మాజీ ప్రపంచ నెంబర్‌వన్ తార క్రిస్ ఎవర్ట్‌పై 3-6, 6-1, 6-4 సెట్ల తేడాతో సెలెస్ జయభేరి మోగించింది. అదే ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి సంచలనాల సెలెస్ ప్రవేశించింది. కెరీర్‌లో అతిపిన్నవయస్సులో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు ప్రవేశించిన ఘనత సెలెస్‌ది. అప్పటి ప్రపంచ నెంబర్‌వన్ తార స్టెఫీ గ్రాఫ్ చేతిలో 6- 3, 3-6, 6-3 సెట్ల తేడాతో సెలెస్ పరాజయం పాలైంది. 1989 నాటికి ప్రపంచ ఆరో నెంబర్ తారగా సెలెస్ నిలిచింది.
మోనికా సెలెస్ 1989 ఫైనల్లో నేర్చుకున్న గుణపాఠాలతో 1990 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో చాలా జాగ్రత్తగా ఆడింది. ఫైనల్ మ్యాచ్‌లో స్టెఫీ గ్రాఫ్‌ను 7-6, 6-4 సెట్ల తేడాతో సెలెస్ ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకుంది. 1990 చివరినాటికి ప్రపంచ రెండో నెంబర్ తారగా సెలెస్ నిలిచింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ 1991 సెలెస్ కెరీర్‌నే మార్చివేసింది. టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్ తార జానా నవోత్నాను 5-7, 6-3, 6-1 సెట్ల తేడాతో మట్టికరిపించి సెలెస్ ప్రపంచ మహిళా టెన్నిస్‌లో అగ్రస్థానాన్ని అధిరోహించింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 1991, 92, 93, 96లలో, ఫ్రెంచ్ ఓపెన్‌లో 1990, 91, 92లలో, వింబుల్డన్‌లో 1992, యూఎస్ ఓపెన్‌లో 1991, 92లలో మోనికా సెలెస్ విజేతగా నిలిచింది. మోనికా సెలెస్ 1992లో వరుసగా ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లను అందుకుని రికార్డు సృష్టించింది. అప్పటికి సెలెస్ వయస్సు 19 ఏళ్లు మాత్రమే.
జర్మనీలోని హాంబర్గ్ వేదికగా 1993లో జరుగుతున్న టోర్నీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓ అగంతకుడు కత్తితో మోనికా సెలెస్‌పై తీవ్రంగా గాయం చేశాడు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి సెలెస్‌కు రెండు సంవత్సరాలు పట్టింది. ఈ సంఘటన అప్పట్లో టెన్నిస్ ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేసింది. ఆ తర్వాత కోలుకుని 1995 నుంచి టెన్నిస్ ఆడటం మొదలుపెట్టింది. సెలెస్ 2008లో టెన్నిస్ క్రీడ నుంచి నిష్క్రమిస్తున్నానని ప్రకటించింది.
మోనికా సెలెస్ కెరీర్‌లో ఆడిన 14 గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో 9సార్లు విజేతగాను, 4సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇక సింగిల్స్‌లో 44, ఇదే విభాగంలో రన్నరప్‌గా 35, డబుల్స్‌లో 6 , సింగిల్స్ టైటిళ్లు గెలుచుకుంది.