ఈ ఏడాది ప్రధాన టోర్నమెంటులపై మాత్రమే దృష్టి పెట్టి ప్రపంచ టాప్ ర్యాంకుల్లో అగ్రస్థాన క్రీడాకారిణిగా ఎదగాలన్నదే తన లక్ష్యంగా ఎంచుకున్నట్లు సెరిబియా క్రిడాకారిణి జలీనా జంకోవిక్ వెల్లడించింది. తాను సాధించగలనన్న నమ్మకం తనకుందని తెలిపింది.
బెంగుళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో పాల్గొనేందుకు బెంగుళూరు వచ్చిన జెంకోవిక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెంబర్ వన్ ర్యాంకు సాధించడమే తన స్వప్నమని... దీని కోసం తాను టెన్నిస్‌లో మరింత శ్రమించాల్సి ఉందని పేర్కొంది.
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో తాను విజయం సాధించినట్లయితే అగ్రస్థానానికి దగ్గరగా వస్తానని చెప్పిన 24 ఏళ్ల జెంకోవిక్ ప్రస్తుతం నాలుగో ర్యాంకులో కొనసాగుతోంది. క్రితం ఏడాదిలో తాను ఎన్నో టోర్నమెంటులో ఆడానని... చాలా వాటిల్లోను గెలిచానని.. కాని ఈ ఏడాది మాత్రం ప్రధానమైనటువంటి టోర్నీల్లో మాత్రమే పాల్గొనేలా ప్రణాళిక చేసుకుంటున్నట్లు వ్యాఖ్యానించింది.
కాగా, 600,000 అమెరికా డాలర్ల ప్రైజ్‌మనీ గల బెంగుళూరు ఓపెన్‌లో పాల్గొనే వారిలో అత్యంత ప్రతిభ గలవారిలో జెంకోవిక్ ఉంది. గత ఏడాది ఆమె నాలుగు టైటిల్లతో సహా 72 మ్యాచ్‌లలో విజయాన్ని సాధించింది. గత ఏడాదిలో తన కెరీర్‌లోనే మూడో ర్యాంకు చేరుకున్న జెంకోవిక్ ఈ ఏడాది చైనాలో జరిగే బీజింగ్ ఒలంపిక్స్‌లో తాను పతకాన్ని సాధించి తన దేశానికి ఇస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
అంతేగాక ఈ ఏడాదిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటు సెమీఫైనల్లోను అడుగుపెట్టింది. ప్రస్తుతం బెంగుళూరు ఓపెన్‌లోను అమెరికా టాప్ ర్యాంకు క్రీడాకారిణిలైన వీనస్, సెరెనా విలియమ్స్‌లపైన కూడా నెగ్గి తీరుతానని ధీమాగా చెబుతోంది.