ప్రపంచ టెన్నిస్ క్రీడలో భారతదేశం నుంచి అత్యుత్తమ డబుల్స్ జోడీ మహేష్ భూపతి-లియాండర్ పేస్. టెన్నిస్ క్రీడలో భారత కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగురవేసిన ఘనత వీరిద్దరిది. భారత టెన్నిస్‌కు కొత్త వన్నెలను భూపతి-పేస్‌లు తీసుకువచ్చారు.
లియాండర్ పేస్ గోవాలో 1973 జూన్ 17వ తేదీన జన్మించారు. కోల్‌కతాలో విద్యాభ్యాసం పూర్తిచేసిన తర్వాత జూనియర్ యూఎస్ ఓపెన్, జూనియర్ వింబుల్డన్ టైటిల్స్‌ను పేస్ కైవసం చేసుకున్నాడు. 1991లో టెన్నిస్ ప్రొఫెషనల్‌గా మారిన పేస్ 1992లో జూనియర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని పేస్ ఆక్రమించాడు.
బార్సిలోనా వేదికగా 1992లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో డబుల్స్ విభాగంలో పేస్-రమేష్ కృష్ణన్‌తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. 1996 అట్లాంటా ఒలింపిక్ క్రీడల్లో సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని పేస్ గెలుచుకుని భారత గౌరవాన్ని నిలబెట్టాడు. అట్లాంటా ఒలింపిక్స్ భారత్ గెలుచుకున్న ఒక్క పతకం పేస్‌ది మాత్రమే. భారత ప్రభుత్వం 1996లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును పేస్‌కు ప్రదానం చేసింది.
చెన్నైకు చెందిన మహేష్ శ్రీనివాస్ భూపతి 1974, జూన్ 7వ తేదీన జన్మించారు. మహేష్ భూపతి 1995 నుంచి టెన్నిస్‌లో పూర్తిస్థాయి ప్రొఫెషనల్‌గా మారాడు. 1999లో వరుసగా మూడు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు.
మహేష్ భూపతి-లియాండర్ పేస్‌లు తొలిసారి 1997లో జతకట్టి బరిలోకి దిగారు. వీరిద్దరూ ఐదేళ్లపాటు కలిసి 23 టోర్నీలలో ఆడి విజేతలుగా నిలిచారు. టెన్నిస్‌లో ప్రముఖ టోర్నీలైన ఫ్రెంచ్, వింబుల్డన్ ఓపెన్‌లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు. ఆతర్వాత మరలా 2001 ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచారు.
2006 ఆసియా గేమ్స్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలవడంతో పేస్-భూపతి జంట విడిపోయారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కలిసి పోరాడేందుకు వీరిద్దరూ సంసిద్ధమవుతున్నారు.