బెల్జియం దేశానికి చెందిన ప్రపంచ నెంబర్‌వన్ తార జస్టిన్ హెనిన్ మహిళా టెన్నిస్‌లో అత్యుత్తమ క్రీడాకారిణిగా నిలిచింది. అతిపిన్న వయసులోనే టెన్నిస్ క్రీడలో అత్యున్నత శిఖరాలను హెనిన్ అధిరోహించింది. ప్రపంచ నెంబర్‌వన్ టెన్నిస్ తారగా 20 ఏళ్ల వయసులోనే హెనిన్ ఈ కిరీటాన్ని అందుకుంది.
జస్టిన్ హార్డిన్నే హెనిన్ గా పిలిచే టెన్నిస్ తార బెల్జియంలోని లీజ్‌లో 1982 జూన్ 1వ తేదీన జన్మించింది. అభిమానులు హెనిన్‌ని ముద్దుగా జులుగా పిలుస్తారు. హెనిన్ 14 ఏళ్ల లేత ప్రాయంలోనే ప్రెంచ్ ఓపెన్ జూనియర్ గర్ల్స్ టైటిల్‌ను 1997లో గెలుచుకుంది. హెనిన్ ప్రొఫెషనల్ కెరీర్‌ను 1999లో ప్రారంభించింది.
ఆంట్వెర్ప్‌లో 1999 మేలో జరిగిన ఉమెన్స్ టెన్నిస్ ఆసోసియేషన్ (డబ్ల్యూటీఏ) టోర్నీలో వైల్డ్‌కార్డ్ ద్వారా హెనిన్ రంగప్రవేశం చేసింది. కెరీర్‌లో ఆడిన తొలి టోర్నీని గెలుచుకుని హెనిన్ రికార్డు సృష్టించింది. డబ్యూటీఏ చరిత్రలో ఆడిన తొలి టోర్నీలో టైటిల్ కైవసం చేసుకున్నవారిలో హెనిన్ ఐదవ ఆమె.
2001లో జరిగిన ప్రెంచ్ ఓపెన్ టోర్నీ ఫైనల్స్ వరకూ వెళ్లిన హెనిన్ ప్రత్యర్ధి వీనస్ విలియమ్స్ చేతిలో పరాజయం పాలైంది. అయితే సింగిల్స్ ర్యాంకుల విభాగంలో హెనిన్ అత్యుత్తమంగా 7వ స్థానంలో నిలిచింది.
2001లో జరిగిన ఫెడ్ కప్ డబుల్స్ ఫైనల్లో ఎలీనా తతర్కోవాతో జోడీ కట్టి టైటిల్‌ను హెనిన్ ద్వయం కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఏడాది జరిగిన నాలుగు డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లోకి హెనిన్ అడుగుపెట్టింది. అందులో రెండింట్లో హెనిన్ జయకేతనం ఎగురవేసింది.
హెనిన్ కెరీర్‌ను 2003 పూర్తిగా మలుపుతిప్పింది. ఈ ఏడాది జరిగిన ఫ్రెంచి ఓపెన్, యూఎస్ టైటిళ్లను కైవసం చేసుకుని ప్రపంచ నెంబర్‌వన్ తారగా నిలిచింది. ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్‌లో వీనస్ విలియమ్స్ చేతిలో హెనిన్ పరాజయం పాలైంది. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్లో మోనికా సెలెస్‌ను హెనిన్ ఓడించింది.
ఫ్రెంచి ఓపెన్ ఫైనల్లో ప్రత్యర్ది అమెరికా తార సెరీనా విలియమ్స్‌ను 6-2, 4-6, 7-5 సెట్ల తేడాతో హెనిన్ ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించింది. యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌లో క్లిజస్టర్స్‌ను ఓడించి టైటిల్‌ను తొలిసారి అందుకుంది. ఇదే ఏడాది అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య అందించే ఉమెన్స్ సింగిల్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ అవార్డును అందుకుంది.
2004లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను హెనిన్ తొలిసారి అందుకుంది. ప్రత్యర్ది క్లిజస్టర్స్‌ను 6-3, 4-6, 6-3 సెట్ల తేడాతో హెనిన్ ఓడించింది. ఫ్రెంచి ఓపెన్‌ను వరుసగా 2005, 2006, 2007లలో హెనిన్ కైవసం చేసుకుంది. ఫ్రెంచ్ ఓపెన్‌ను నాలుగుసార్లు అందుకుని హెనిన్ తనదైన రికార్డును సాధించింది. 2007లోనే ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటుగా యూఎస్ ఓపెన్‌ను అందుకుని 2003 నాటి చరిత్రను హెనిన్ తిరగరాసింది.
సింగిల్స్ టోర్నీలలో నాలుగుసార్లు హెనిన్ రన్నరప్‌గా నిలిచింది. 2001లో జరిగిన వింబుల్డన్ ఫైనల్లో వీనస్ విలియమ్స్ చేతిలో 6-1, 3-6, 6-0 సెట్ల తేడాతో హెనిన్ ఓడిపోయింది. 2006లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లలో హెనిన్ ఫైనల్ ముగిట చతికిలపడింది.
హెనిన్ టెన్నిస్ క్రీడ నుంచి వైదొలగుతున్నానని ఈనెల 14వ తేదీన ప్రకటించింది. హెనిన్ ఇప్పటివరకూ 41 డబ్ల్యూటీఏ టైటిళ్లను కైవసం చేసుకుంది. ఇందులో ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ ఉన్నాయి.