ఇటీవల ముగిసిన పసిఫిక్ లైఫ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటు పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను కైవసం చేసుకున్న సెరిబియా క్రీడాకారిణి అనా ఇవనోవిక్, నొవాక్ జకోవిక్‌లు అగ్రస్థానంపై కన్ను వేశారు. ప్రపంచ టాప్ ర్యాంకుల్లో తాము కొనసాగడమే కాకుండా... ప్రథమ శ్రేణి ర్యాంకు స్థానానికి ఎదగాలన్నదే తమ లక్ష్యమని వారివురు వెల్లడించారు.
ఈ ఆదివారం జరిగిన పసిఫిక్ లైఫ్ ఓపెన్ టైటిల్ టోర్నమెంటులో రష్యాకు చెందిన స్వెత్లానా కుజ్‌నెత్సోవాపై 6-4, 6-3తో ప్రపంచ నెంబర్ టూ క్రీడాకారిణి ఇవనోవిక్ అనూహ్య విజయాన్ని సాధించి సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఆరు సార్లు వీరిరువురు తలపడగా.. వాటిలో ఐదు మ్యాచ్‌ల్లో ఇవనోవిక్ జయకేతనం ఎగురవేసింది.
కాలిఫోర్నీయన్ ఎడారిలో ఇవనోవిక్ అద్భుతమైన ప్రదర్శన ఆమె కెరీర్‌లోనే కీలకమైన మలుపుగా క్రీడానిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండు వారాల ఈ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకోవడం తొలి సారి అని... ఫాంను ఇలాగే కొనసాగించేందుకు తనలోని భావాలను నియంత్రించుకుంటున్నట్లు ఇవనోవిక్ విలేకరులకు తెలిపింది.
ఇక ఇదే టోర్నీలో పురుషుల విభాగంలో ప్రపంచ నెంబర్ త్రీ ఆటగాడు జకోవిక్.. తన అద్భుత ఆటతీరుతో అమెరికాకు చెందిన మార్డీ ఫిష్‌పై 6-2, 5-7, 6-3తో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే టోర్నీలో జకోవిక్ స్పెయిన్‌కు చెందిన ప్రపంచ నెంబర్ టూ ఆటగాడు రాఫెల్ నాదల్‌పై జయకేతనం ఎగురవేశాడు.