Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈయన రాకెట్‌లకు ఇప్పటికీ స్పాన్సర్స్ లేరు..!

Advertiesment
క్రీడలు
FILE
ఇతను అగస్సీలా సోగ్గాడు కాడు.. ఇక ఫెదరర్, రఫెల్ నాదల్‌లకున్న ఇమేజ్ లేదు. జొకోవిచ్, డెల్ పొట్రో, ముర్రేల్లాగా అమ్మాయిల కలల రాకుమారుడూ కాదు.. రాడిక్‌లా దూసుకెళ్లే సర్వీస్‌లను సంధించలేడు.. సదర్లింగ్, సోంగాలాల మాదిరి భారీకాయుడేమీ కాదు.. అయితే ఎంతో కాలంగా అంతర్జాతీయ టెన్నిస్ రంగంలో స్థిరంగా రాణిస్తున్న ఓ "నిరాడంబర ఛాంపియన్" మాత్రమే. అతనే నికొలాయ్ డెవిడెంకో.

ఆకట్టుకునే ఆకారం లేకపోయినా, స్థిరమైన సంకల్పబలంతో అనుకున్న లక్ష్యానికి మౌనంగా చేరుకోవడమే ఇతని పని. తాజాగా సీజన్ ముగింపు టోర్నీ అయిన "ఏటీపీ వరల్డ్ టూర్ ఛాంపియన్‌షిప్" సింగిల్స్ టైటిల్‌ను సాధించటమూ ఇందులో భాగమే. పైకి సాదాసీదాగా కనిపించే ఈ అసామాన్య ఆటగాడు గ్లామర్, ఇమేజ్ లాంటి వాటికే దూరంగా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడతాడు.

ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటే చాలా స్వేచ్ఛను కోల్పోతామనీ, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సంతోషాలను కూడా పంచుకోలేని పరిస్థితులకు నెట్టబడతాం కాబట్టి.. ఎలాంటి ఇమేజ్‌ల్లోనూ ఇరుక్కోవడం తనకు ఇష్టముండదని చెబుతుంటాడు డెవిడెంకో.

ఇదిలా ఉంటే.. డెవిడెంకో గత ఏడెనిమిది సంవత్సరాలుగా అంతర్జాతీయ పురుషుల టెన్నిస్‌లో నిలకడగా రాణిస్తున్నా... ఈ రష్యా క్రీడాకారుడు మాత్రం ఎవ్వరి దృష్టిలోనూ పడలేదు. అయితే తాజా ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన తరువాత మాత్రం ఇతన్ని అందరూ గుర్తించారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రపంచ టాప్-6 ఆటగాళ్లలో ఒకడిగా ఉంటున్నప్పటికీ ఇతను వాడే రాకెట్‌లకు స్పాన్సర్స్ లేరంటే అతిశయోక్తి కాదు.

ఇకపోతే ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన డెవిడెంకో నుంచి ఏ ఒక్కరూ ఆటోగ్రాఫ్ కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించటం గమనార్హం. అయితే టైటిల్ సాధించాక ఈ పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. మైదానంలో ఈయన ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు అభిమానులు వరుస కట్టారు.

ఈ సందర్భంగా డెవిడెంకో మాట్లాడుతూ.. ఈ పరిమాణానికి ఆనందంగా ఉందన్నాడు. ముందు అందరూ నాదల్, ఫెదరర్‌లపైనే దృష్టిపెట్టారనీ, తననెవరూ గుర్తు పట్టలేదని అన్నాడు. అయితే ఇదంతా తన మంచికేననీ, ఇలాంటి స్వేచ్ఛనే తాను ఆస్వాదిస్తానని.. ఎందుకంటే ఇమేజ్ ఎక్కువగా ఉంటే ఇబ్బందులు తప్పవు, ఈ విషయం ఫెదరర్‌కు కూడా బాగా తెలుసునని పేర్కొన్నాడు.

కుటుంబానికి ఎంతగానో విలువనిచ్చే డెవిడెంకో.. ఏటీపీ విజయంతో లభించిన 7 కోట్ల 2 లక్షల రూపాయలను ఎలా ఖర్చుపెట్టాలో ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో పర్యటించి, ఆ తర్వాత మాస్కోలో స్థిర నివాసం కోసం సొంత ఫ్లాట్ కొనుగోలు చేస్తానని ఆనందంగా చెబుతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu