బ్లాక్ మండే... స్టాక్ మార్కెట్ పతనం...

సోమవారం, 9 మార్చి 2020 (16:27 IST)
భారత స్టాక్ మార్కెట్‌లో మరో బ్లాక్ మండే నమోదైంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ భారత స్టాక్ మార్కెట్‌పై కూడా తీవ్రప్రభావం చూపింది. ఇప్పటికే వంద దేశాలకు విస్తరించిన ఈ వైరస్‌తో వాణిజ్య రంగం కుదుపునకుగురైంది. 
 
దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పతమయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఫలితంగా సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మన మార్కెట్లు కుప్పకూలాయి. 
 
ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తోందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో, ఒకానొక సమయంలో సెన్సెక్స్ ఏకంగా 2,500 పాయింట్ల వరకు పతమైంది. ఆ తర్వాత మార్కెట్లు కొంతమేర పుంజుకున్నాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,941 పాయింట్లు పతనమై 35,634కు పడిపోయింది. నిఫ్టీ 538 పాయింట్లు కోల్పోయి 10,451కి దిగజారింది.
 
బాంబే స్టాక్ మార్కెట్‌లో సోమవారం ఒక్క కంపెనీ కూడా లాభపడలేదు. ఓఎన్జీసీ (16.26), రిలయన్స్ ఇండస్ట్రీస్ (12.35), ఇండస్ ఇండ్ బ్యాంక్ (10.66), టాటా స్టీల్ (8.23), టీసీఎస్ (6.88) ప్రధానంగా నష్టపోయిన కంపెనీల జాబితాలో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ