Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాధా మాధవ రాసలీలల "మజులి ద్వీపం"

Advertiesment
పర్యాటక రంగం
ప్రతి ఏడాది మూడు రోజులపాటు "రాస ఉత్సవం" జరిగే ప్రాంతమే "మజులి ద్వీపం". ద్వీపం అనగానే ఎవరికైనా ఇట్టే గుర్తుకు వచ్చేది సముద్రం మధ్యలో ఉన్న భూమి. అయితే మంచినీటి మధ్య ద్వీపాలు కూడా ఉన్నాయి. నదుల మధ్యలో ఉన్న ఇలాంటి ద్వీపాలలో ప్రపంచంలోనే అతిపెద్దది ఈ 'మజులి ద్వీపం'.

అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్రానది మధ్యలో ఏర్పడిన ఈ "మజులి ద్వీపం" ఎంతో సుందరమైంది. ఈ ద్వీపం మధ్యలో నిర్మించిన కాటేజ్‌లలో నుండి సూర్యాస్తమయాన్ని చూడటం ఓ మరచిపోలేని మధురమైన అనుభూతి అని చెప్పవచ్చు.

మజులి ద్వీపంలో చెట్లు, చేమలూ.. పుట్టలూ, నదీ జలాలు... ఇలా ఏవి చెప్పుకునా, అవన్నీ కాలుష్యానికి దూరంగా, అతీతంగా నిలచి ఉన్నాయి. మానవుడి కన్ను ఈ ప్రాంతంపై పడలేదు కాబట్టి.. ఇక్కడి సౌందర్యం ఏ మాత్రం ధ్వంసం కాకుండా, స్వచ్ఛంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఏ రోజు చూసినా సరికొత్త తాజాదనంతో నిండిన ఈ మజులి ద్వీపంలో... గత ఐదు వందల సంవత్సరాలకు పైగానే మానవులు నివసిస్తున్నప్పటికీ స్వచ్ఛమైన ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

మహాభారతంలో చెప్పిన ప్రాగ్జోతిష్యపురమే అస్సాం. అనేక వందల సంవత్సరాలుగా రాజవంశాలు, ఇతర పాలకులు వాడిన ఆయుధాలు, ధరించిన దుస్తులు ఇక్కడ నేటికీ కనిపిస్తాయి. మజులి ద్వీపవాసులు ఇప్పటికీ పై తరహా దుస్తులనే వాడుతున్నారు. పైగా ఈ ప్రాంతం హస్తకళలకు పేరుపొందింది.

ఇదిలా ఉంటే.... ప్రతి సంవత్సరం ఈ మజులి ద్వీపంలో "రాస ఉత్సవం" జరుగుతుంది. మూడురోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో శ్రీకృష్ణుడు గోపికల రాసలీలలను తిరిగి జరుపుతారు. అది ఒక రకమైన ఆధ్యాత్మిక ఉత్సవం. ఇక్కడి గిరిజనులు ధరించే రంగురంగుల దుస్తులు, పూసలు ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంటాయి.

కొత్త వాతావరణంలో, పూర్తి కొత్తదనంతో గడపాలనుకునే జంటలకు "మజులి" ఓ అద్భుతమైన అనుభవాన్నిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Share this Story:

Follow Webdunia telugu