Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాంగ్రోవ్ అందాల దీవి "పిచ్చావరం"

Advertiesment
మాంగ్రోవ్ అందాల దీవి
"సముద్రంలోకి వెళ్లేముందు చుట్టూ చెట్ల మధ్య ఉండే కాలువల్లో కాసేపు విహరిస్తే...!" అన్న ఊహే మనల్ని ఒక్కసారిగా ఆనంద తీరాలకి తీసుకెళ్లక మానదు. మరి అలాంటి ప్రాంతం ఈ భూప్రపంచంలో నిజంగా ఉంటే, రెక్కలు కట్టుకుని వాలిపోతాం కదూ...? అయితే వెంటనే చిదంబరం అనే ఊరికి చేరుకోవాల్సిందే..!

ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన మాంగ్రోవ్ చెట్ల (వీటినే తెలుగులో సముద్రపు ఉప్పునీటి వాతావరణంలో పెరిగే నీటి చెట్లు, మడ చెట్టు, నల్లమడ చెట్లు అని పిలుస్తుంటారు) అడవి ఉండే ప్రాంతమే "పిచ్చావరం". నేల ప్రాంతానికీ, సముద్రం మధ్య ఒక సుదీర్ఘమైన ఇసుక దిబ్బలాగా ఏర్పడి... ఆ ఇసుక దిబ్బకు అవతలివైపున సముద్రం ప్రభావంతో, ఇటువైపు మంచినీటి వనరు లాంటిది ఏర్పడుతుంటుంది. దాన్నే "బ్యాక్ వాటర్స్ (ఉప్పుటేరు లేదా ఉప్పుకయ్య)" అని సంబోధిస్తుంటారు.

ఇలాంటి "బ్యాక్ వాటర్స్" ఏర్పడిన ప్రాంతమే పిచ్చావరం. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే... సుమారు 400 హెక్టార్ల పెద్ద చెరువులాంటి లోతులేని నీటి ప్రాంతం, దానిపై దట్టంగా పెరుగుతున్న మాంగ్రోవ్ చెట్లు... అనేక చిన్న దీవులు, వాటి మధ్య కాలువలు... వీటన్నింటి సమాహారమే "పిచ్చావరం".

పిచ్చావరం దీవుల మధ్య అనేకమైన అరుదైన వృక్ష జాతులు పెరుగుతున్నాయి. ఈ వృక్షాల్లో తలదాచుకునేందుకోసం పెలికాన్, ఎరేటర్ లాంటి పక్షులు వస్తుంటాయి. అంతేగాకుండా.. సముద్రం దగ్గరగా ఉండటంతో జెల్లీ చేపలు, పీతలు, అరుదైన సాగర జీవులూ మనకు ఇక్కడ దర్శనమిస్తుంటాయి. ఈ రకంగా చూస్తే... వృక్ష, పక్షి, జంతుశాస్త్ర నిపుణులకు ఇది స్వర్గధామమనే చెప్పవచ్చు.
ప్రభాకరన్ కూడా వస్తుండేవాడని...!
  ఈ మధ్యనే లంక సైన్యం చేతిలో మరణించిన ఎల్టీటీఈ అధినేత వేలుపిల్లై ప్రభాకరన్ తమిళనాడుకు వస్తూ, పోతున్న క్రమంలో ఈ ప్రాంతాన్ని ఆశ్రయంగా చేసుకున్నాడని కూడా చెబుతుంటారు. ఇప్పటికీ ఈ దీవిని "ప్రభాకరన్ దిట్టు" (దిబ్బ) అని కూడా పిలుస్తుంటారు.      


ఇంతటి ఆహ్లాదకరమైన ప్రాంతమైన పిచ్చావరంపై... తమిళనాడు ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల నుంచే దృష్టి సారించింది. ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. అంతకుమునుపు స్థానికులు తప్ప ఇతరులెవరూ ఈ ప్రాంతానికి వచ్చేవారు కారు.

ఎందుకంటే ఒకప్పుడు పిచ్చావరం ప్రాంతం స్మగ్లర్లకు నెలవుగా ఉండేదట. అక్రమ ఆర్జిత సొమ్ము కూడా ఈ దీవుల్లో దాచేవారని వదంతులున్నాయి కూడా.. ఇక ఈ మధ్యనే లంక సైన్యం చేతిలో మరణించిన ఎల్టీటీఈ అధినేత వేలుపిల్లై ప్రభాకరన్ తమిళనాడుకు వస్తూ, పోతున్న క్రమంలో ఈ ప్రాంతాన్ని ఆశ్రయంగా చేసుకున్నాడని కూడా చెబుతుంటారు. ఇప్పటికీ ఈ దీవిని "ప్రభాకరన్ దిట్టు" (దిబ్బ) అని కూడా పిలుస్తుంటారు.

ఇక పాతకాలం నటుడు ఎంజీఆర్ కూడా "ఇదయక్కణి" అనే చిత్రం కోసం ఈ మాంగ్రోవ్ దీవిని వాడుకున్నారు. కాబట్టి, దీనిని "ఎంజీఆర్ దిట్టు" అని కూడా పిలుస్తుంటారు. అలాగే శరత్ కుమార్ నటించిన "సూర్యన్" అనే చిత్రాన్ని కూడా ఇక్కడే చిత్రీకరించారు.

ఈ పిచ్చావరం దీవిలో మొత్తం 1,300 చిన్నా చితక దీవులుండగా... వాటిలో చాలావాటికి మార్గం లేదు. మరికొన్నింటికి మాత్రం మార్గాలు ఏర్పరచి, గంటపాటు పర్యాటకులను పడవ ద్వారా తీసుకెళ్లే ఏర్పాట్లను చేసింది తమిళనాడు ప్రభుత్వం. అబ్బో... పడవలో వెళ్లాలా... చాలా లోతుగా ఉంటుందేమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దీవుల్లో మోకాటిలోతు నీటిలోనే వెళ్లవచ్చు. అయితే సహాయకుడి తోడు లేకుండా వెళ్తే సులభంగా దారి తప్పే ప్రమాదం పొంచి ఉంటుంది.

మరి ఈ ఎంజీఆర్ దిట్టుకు చేరుకోవడం ఎలాగంటే... చెన్నై నగరం నుంచి చిదంబరం అనే ఊరికి 248 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో 4 లేదా 5 గంటలపాటు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే రైల్లో అయితే చెన్నై నుంచి చిదంబరం రైల్వేస్టేషన్‌కు మూడున్నర గంటల సమయంలో చేరుకోవచ్చు. చిదంబరం నుంచి పిచ్చావరం చేరుకోవాలంటే, మరో 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి.

చిదంబరం నుంచి పిచ్చావరానికి ప్రతి అరగంటకో బస్సు ఉంటుంది. పిచ్చావరం పడవ ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి 125 రూపాయల చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇక వసతి విషయానికి వస్తే... చిదంబరంలో ఏదైనా హోటల్‌లో ఉండటం ఉత్తమం. పిచ్చావరంలో కూడా టీటీడీ కాటేజీలు ఉన్నప్పటికీ... అక్కడే రాత్రంతా ఉండాల్సిన అవసరం పరిశోధకులకు తప్ప, పర్యాటకులకు ఉండదు కాబట్టి చిదంబరంలో ఉండటమే శ్రేయస్కరం.

Share this Story:

Follow Webdunia telugu