ప్రపంచంలోనే ఇవి అత్యంత సుందరమైనవట...!
సాయం సంధ్య వేళల్లో అస్తమించే సూర్యుడిని చూస్తూ.. పట్టుకుంటే సుతారంగా జారిపోయే సముద్రపు ఇసుకతో ఆడుకుంటూ.. కడలి అందాలను కళ్లతో జుర్రుకుంటూ.. అమాంతం చిన్నపిల్లలైపోవాలని ప్రతి ఒక్కరూ అనుకోవటం తప్పుకాదు. ఎందుకంటే, ఈ అనుభూతి చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే కుటుంబంతో కలిసి ఆనందంగా విహరించే స్థలాల్లో సముద్ర తీరాలకు చాలామంది మొదటి స్థానాన్నిస్తుంటారు.ఇలాంటి వారి కోసం "లోన్లీ ప్లానెట్స్" అనే సంస్థ "ట్రావెల్ విత్ చిల్డ్రన్స్" అనే పేరుతో పిల్లలతో కలిసి విహరించదగ్గ పది అందమైన బీచ్‌లను ఎంపిక చేశారు. ఆ బీచ్‌లలోని అందాలు, అవి ఏయే ప్రాంతాలలో ఉన్నాయో తదితర వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా...?!కోస్తాడెల్‌సడ్ బీచ్...ఇటలీలోని కోస్తా డెల్‌సడ్ బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు ముఖ్య కారణం.. అక్కడి వాతావరణం ఆహ్లాదభరితంగా ఉండటంతోపాటు, చాలా స్వచ్ఛమైన నీటితో, తెల్లటి ఇసుకతో మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. ఇటలీ దేశంలోని అన్ని బీచ్‌లకంటే ఇది ఎంతో వైవిద్యభరితంగా ఉండటంవల్లనే అందమైన సముద్ర తీర ప్రాంతాలలో మొదటి స్థానాన్ని ఎగరేసుకుపోయింది.
కటోస్లో బీచ్...పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ ప్రాంతంలో గల ఈ బీచ్.. అందంగానూ, అత్యంత సురక్షితమైనదిగానూ గుర్తింపు పొందింది. ఎంత సురక్షితం అంటే.. చిన్నపిల్లలు సైతం ఇక్కడి సముద్రంలో మునిగేందుకు చాలా అనువుగా ఉంటుందిక్కడ. ఈ సముద్రం నీటిలో ఉప్పు శాతం కూడా తక్కువగా ఉండటంవల్ల చాలా మంది పర్యాటకులు జలకాలాడేందుకు కూడా ఇష్టపడుతుంటారు.డర్బన్ బీచ్...దక్షిణాఫ్రికాలో గల ఈ సముద్ర తీరంలో సాధారణంగా ఉండే వేడికంటే తక్కువగా నీళ్లు చల్లగా, జిల్లుమనిపించేలా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ఈత కొట్టేందుకు అనువుగా చాలా ఈత కొలను (స్విమ్మింగ్‌ఫూల్స్)లను కూడా ఈ బీచ్‌లో ఏర్పాటు చేసి ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అందుకే ఈ డర్బన్ బీచ్ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.కరోన్ బీచ్...కుటుంబ సభ్యులతో, స్నేహితులతో.. సరదాగా, హాయిగా సందర్శించేందుకు అనువుగా ఉండే ఈ సముద్ర తీరం థాయ్‌లాండ్ దేశంలో ఉంది. ఇక్కడి సముద్రపు ఒడ్డున ఉండే అనేక పార్కులు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. అంతేగాకుండా ఇక్కడ సీఫుడ్స్ రెస్టారెంట్లతో కూడిన ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌లు కూడా అనేకం ఉన్నాయి. చాలా సందడిగా ఉంటే ఈ బీచ్‌ను రాత్రిపూట కూడా సందర్శించేందుకు అనేకమంది యాత్రికులు ఆశక్తి చూపిస్తుంటారు.
క్వాయ్ బీచ్...అమెరికాలోని హవాయ్‌లో ఈ క్వాయ్ సముద్ర తీరం ఉంది. సాధారణంగా బీచ్ అంటే ఇసుకతిన్నెలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం సహజమేగానీ.. ఈ బీచ్‌కు అదనంగా మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే... చిన్నపిల్లల కోసం ఇక్కడ "డిస్కవరీ మ్యూజియం"ను ఏర్పాటు చేయడమే. ఈ మ్యూజియంలో సముద్రంలోని అనేక రకాలైన చేపలు, ఇతర జీవులను చూసేందుకు చిన్నపిల్లలు ఎగబడుతుంటారు.ఐటుటాకి బీచ్...కుక్ ఐలాండ్‌లో గల ఈ ఐటుటాకి బీచ్‌లోని ఇసుక మామూలు ఇసుకలాగా కాకుండా.. చాలా మెత్తగా, హాయిగా ఉంటుంది. దీనిపై పడుకుంటే మెత్తటి పరుపుపై పడుకున్న అనుభూతిని ఇస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇదే గాకుండా ఈ బీచ్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. సముద్రంపై విహరించాలనే వారికి బోట్ సౌకర్యం ఉండటమే..! ఈ తీరంలో అనేక రకాల చేపలు ఒడ్డునే కనిపిస్తూ సముద్రంలో ఈతకొట్టేవారికి కనువిందు చేస్తుంటాయి.నూసా బీచ్..అందమైన పది సముద్ర తీర ప్రాంతాలలో ఏడవ స్థానంలో నిలిచిన ఈ నూసా బీచ్ ఆస్ట్రేలియా దేశంలో ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహరించాలనుకునేవారికి చాలా చక్కటి ప్రదేశం ఇది. సరదాగా గడిపేందుకు, ప్రకృతిలో లీనమై పరవశించిపోవాలనుకునేవారికి ఇక్కడి "నూసా నేషనల్ పార్క్" స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల పూల మొక్కలతో పాటు మహా వృక్షాలు సైతం కనువిందు చేస్తుంటాయి.తావిరా బీచ్..పోర్చుగీస్‌కు తూర్పున ఉండే ఈ బీచ్ వెంబడి కొన్ని కిలోమీటర్ల పరిధిలో నగరాల మాదిరిగా అనేక రకాల షాపులు, హోటళ్లు సందడి సందడిగా, హడావుడిగా ఉంటాయి. పడవ ప్రయాణం చేసేందుకు ఈ బీచ్ అనుకూలంగా ఉంటుంది. ఈ పడవ ప్రయాణానికి అనుకూలంగా అనేక రకాల బోట్లు ఇక్కడ పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి కూడా..!సాయులిటా బీచ్...ఉత్తర అమెరికా, యూరోపియన్‌లు దగ్గరగా ఉండే ఈ సాయులిటా బీచ్ చాలా సురక్షితమైనది. ఇక్కడి తీరంలో చిన్నపిల్లలు జలకాలాడేందుకు వీలుగా అక్కడ ప్రత్యేక సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. అంతేగాకుండా సరదాగా ఆటలు ఆడుకుంటూ.. ఐస్‌క్రీం తింటూ సముద్రపు అలలను ఎంజాయ్ చేయాలనుకునేవారు తప్పనిసరిగా చూడాల్సిన అందమైన బీచ్ సాయులిటా.సానర్ బీచ్...ఇండోనేషియాలోని బాలిలో గల సానర్ బీచ్ పది అందమైన బీచ్‌లలో చివరి స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడికి ఎక్కువగా కొత్తగా పెళ్లైన జంటలు, స్నేహితులు వస్తుంటారు. ఓపెన్ రెస్టారెంట్లను కలిగి ఉండటం ఈ బీచ్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. పక్కనే చిన్న నగరం కూడా ఉండటంవల్ల షాపింగ్ చేసేందుకు ఆసక్తి ఉన్న పర్యాటకులు కూడా ఈ బీచ్‌కు వచ్చేందుకు ఇష్టపడుతుంటారు.