అందమైన సముద్రతీరాలు, రంగు రంగుల పక్షులు, అమాయకమైన జింకలు, ఆకుపచ్చని అడవులు, మైమరపించే ప్రకృతి అందాలు, ఎప్పుడూ చూడని జలచరాలు, పగడపు దీవులు.. ఇలా చెప్పుకుంటూ పోతే అండమాన్ అందాలకు అంతే ఉండదు. రెండువేల రకాలకు పైబడిన మొక్కలు, 250కంటే ఎక్కువగా ఉండే పక్షి జాతులతో అలరారే ఈ ప్రాంతాన్ని ఒక్కసారి సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించకమానదు.
బంగాళాఖాతంలో ఉన్న ఈ అండమాన్ నికోబార్ దీవులు భారత భూభాగానికి తూర్పుదిక్కులో 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఉత్తర, దక్షిణ భాగాలుగా దాదాలు 700 మీటర్ల పొడవున వ్యాపించి ఉన్న ఈ ప్రాంతంలోని 36 దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు.
అండమాన్ నికోబార్ దీవుల చరిత్రను చూస్తే... బ్రిటీష్‌వారి హయాంలో భారత స్వాతంత్ర్య పోరాట వీరులకు అనేక రకాల శిక్షలు విధించి ఇక్కడికి తరలించేవారు. అదంతా 19వ శతాబ్దంనాటి విషయమైనా.. ఇప్పుడు ఈ దీవుల్లో మూడు లక్షల మందికి పైబడే ప్రజలు జీవిస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా తమిళనాడు, పశ్చిమబెంగాల్‌కు చెందినవారు వలస వచ్చి స్థిరపడిపోయారు.
అంతేగాకుండా ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో అనేక రకాల మతాలు, జాతులు, కులాలు, విభిన్న సంస్కృతులకు చెందినవారు జీవిస్తుండటంతో ఈ ప్రాంతాన్ని మినీ ఇండియా అనికూడా పిలుస్తుంటారు. ఇక్కడి ట్రైబల్ రిజర్వ్స్, నేషనల్ పార్కులు, వైల్డ్‌లైఫ్ సాంక్చురీలు, మహాత్మాగాంధీ మెరైన్ నేషనల్ పార్క్.. తదితర ప్రాంతాలను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
అండమాన్ నికోబార్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలల్లో పదిహేను రోజులపాటు ఉత్సవాలు జరుపుతుంటుంది. ఎకో-ఫ్రెండ్లీ టూరిజాన్ని మరింతగా ప్రోత్సహించేందుకుగానూ ఈ ఉత్సవాలలో సంగీత, నృత్య, వాయిద్య రంగాలలో ప్రముఖ కళాకారుల బృందాలతో కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా వాటర్ స్పోర్ట్స్, పరుగుపందేలు, మ్యాజిక్ షోలు, పప్పెట్ షోలు, స్కూబా డైవింగ్ లాంటి ఎన్నో క్రీడలను సైతం నిర్వహిస్తారు.
అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇక్కడి "హవెలాక్ ద్వీపం"లో సుభాష్ మేళాను నిర్వహిస్తారు. ఇందులో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను, వేడుకలను నిర్వహిస్తారు. ఇంకా స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ప్రతియేటా జనవరిలోనే "నీల్ ద్వీపం"లో వివేకానంద మేలాను జరుపుతారు.
అందాలకు, ఆనందాలకు నెలవైన ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోని పర్యాటక ప్రాంతాలలో వాటర్ స్కైయింగ్, వాటర్ స్కూటర్, పారా సైలింగ్, విండ్ సర్ఫింగ్, సెయిలింగ్, స్పీడ్ బోటింగ్, రోయింగ్, పాడిల్ బోటింగ్, కయాకింగ్, ఆక్వా సైక్లింగ్, ఆక్వా గ్లైడింగ్, బంపర్ బోట్స్ లాంటి సాహసోపేతమైన క్రీడలను సైతం నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే అండమాన్ దీవులు ట్రెక్కింగ్‌కు కూడా ఎంతో అనుకూలంగా ఉంటాయి.