Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"గ్లోబల్ వార్మింగ్"తో వేడెక్కిన మహా సముద్రాలు

Advertiesment
FILE
గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని ఈ ఏడాది సమస్త సాగర జలాలు గరిష్ట స్థాయిలో అధిక వేడితో మసిలిపోయాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ మహాసముద్రం, ఫసిఫిక్ మహా సముద్రం జలాలు అన్నింటికంటే ఎక్కువగా వేడెక్కాయని.. గత 130 సంవత్సరాలతో పోల్చితే సముద్ర జలాలు ఇంతగా వేడెక్కటం ఇదే ప్రప్రథమమని వారు వెల్లడించారు.

గ్లోబల్ వార్మింగ్‌కు, ఎల్‌నినో కూడా తోడు కావడంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యిందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. జూలై నెలలో జరిపిన ఈ విశ్లేషణల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్త సముద్రజలాల సగటు ఉష్ణోగ్రత గరిష్టంగా 62.6 డిగ్రీల సెంటీగ్రేడుకు చేరుకుందని అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం ప్రకటించడం గమనార్హం.

సాధారణంగా భూమితో పోల్చినట్లయితే.. నీరు వేడెక్కేందుకు, చల్లారేందుకు ఎక్కువ సమయం పడుతుందనీ.. ఈ కారణం వల్లనే ఎప్పుడూ భూమిమీదే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఏడాది ఉత్తరార్థ గోళంలోని చాలా సముద్రాల్లో జలాలు సాధారణ స్థాయికంటే, అత్యధిక స్థాయిలో వేడెక్కాయని వారు తెలిపారు.

హరికేన్‌లకు పుట్టినిల్లుగా పిలిచే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో అయితే.. గరిష్టంగా 90 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యిందనీ, ఆర్కిటిక్ ప్రాంతంలో సాధారణం కంటే పది డిగ్రీలు ఎక్కువగా సముద్ర జలాలు వేడెక్కాయని శాస్త్రవేత్తలు వివరించారు. దీని ఫలితంగా మంచు కరగడం మరింతగా వేగవంతమైందని కొలరాడో యూనివర్సిటీ ఎర్త్ సైన్స్ అబ్జర్వేషన్ సెంటర్ డైరెక్టర్ వలీద్ ఆబ్దలాటి పేర్కొన్నారు.

సముద్రంలో ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతలతో ఉండే ప్రాంతాలు కూడా ఈ సంవత్సరం గరిష్టంగా వేడెక్కాయనీ... దీని పర్యవసానంగా ఎల్‌నినో వల్ల తలెత్తే దుష్ర్పభావాలు మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మధ్య ఫసిఫిక్ సముద్ర జలాలు వేడెక్కినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు.

అదలా ఉంటే.. ఎల్‌నినో దానికి వ్యతిరేక ప్రభావ అయిన లానినోలు కొన్ని సంవత్సరాల వ్యవధిలో మళ్లీ మళ్లీ వస్తుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎల్‌నినో వచ్చినప్పుడు సముద్ర జలాలతోపాటు, భూమిపై కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. ఫలితంగా మరింత శక్తివంతమైన హరికేన్లు పుట్టుకొచ్చే ప్రమాదం లేకపోలేదని వారు అంచనా వేస్తున్నారు.

ముందు ముందు ఎల్‌నినో, లానినో, హరికేన్లు.. తదితర పెను ప్రమాదాలనుంచి తప్పుకోవాలంటే... ప్రపంచ ప్రజానీకం ఇప్పటికైనా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టేందుకు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయా దేశాల ప్రభుత్వాలు మేల్కొని.. ప్రజలతో మమేకమై పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ప్రకృతి విలయతాండవానికి, ఆగ్రహానికి ఫలితం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu