ఆ స్వర్గమే దిగివచ్చి.. "అండమాన్"లా మురిపించి..!!
అందమైన ప్రకృతిని కొంగున ముడి వేసుకున్న ఈ ప్రాంతంలో తెల్లవారుఝాము 5 గంటలకల్లా తెలతెలవారుతుంటుంది. అలాగే సాయంత్రం 5 గంటలకల్లా చీకటి పడిపోతుంటుంది. ఈ ప్రాంతం పేరే "అండమాన్". మన స్వాతంత్ర్య సమరయోధులు చెరసాలల్లో మగ్గిపోయింది ఈ ద్వీపంలోనే. సముద్రాన్ని నిలువెల్లా తాగేయాలనీ, ఆకాశాన్నంతటినీ గుప్పిట్లో బంధించేయాలని, ప్రకృతి ఒడిలో ఆదమరచి సేదతీరాలని భావించే ప్రకృతి ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన ప్రదేశమే అందాల అండమాన్.ఎటువైపు చూసినా నీరు.. నీలి రంగు సముద్రంతో మిల మిలా మెరిసిపోయే అండమాన్‌లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం సెల్యులార్ జైలు. ఈ జైలులో లైట్ అండ్ సౌండ్ షోను ఏర్పాటు చేశారు. ఈ షోలో హిందీ, ఇంగ్లీషు భాషల్లో... జైలు చరిత్ర గురించి, దాని గొప్పతనం గురించి, మన భారత స్వాతంత్ర్య సమరయోధులను బ్రిటీష్‌వారు ఏ విధంగా శిక్షించిందీ.. తదితర విషయాల గురించి వివరంగా చెబుతారు.ఆ తరువాత చూడాల్సింది.. "బారాటంగ్ ఐలాండ్". ఇక్కడికి వెళ్లాలంటే మొత్తం అడవిగుండానే ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. అలా వెళ్తుంటే దారిలో "జారవా" జాతికి చెందిన మనుషులు కనిపిస్తారు. వీరు బట్టలు అసలు వేసుకోరు. వారిలో కొంతమంది మాత్రం నైకీ షూలు, నిక్కర్లు వేసుకుని ఉంటారు, అవి కూడా పర్యాటకులు ఇచ్చినవే. ఇక్కడ కెమెరాలను వాడకూడదు. అలాగే మనతో తీసుకెళ్లిన ఆహారాన్ని ఆ ప్రజలకు ఇవ్వకూడదు. వాళ్లు మూలికలు, ఉప్పు కారం లేని ఆహార పదార్థాలను మాత్రమే తింటుంటారు కాబట్టి.. మన ఆహారం వారికి విషంతో సమానమే.
స్కూబా డైవింగ్ మరో ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. మన భుజాలకు ఎయిర్ సిలిండర్ తగిలించి సముద్రం మధ్యలోకి తీసుకెళ్లి షిప్ చివర్లో కూర్చోబెట్టి వెనక్కి తోసేస్తారు. అలా నీళ్లలో పడిపోయినవారు సముద్రంలో 25 మీటర్ల లోతుకు వెళ్లిపోతారు. అలా వెళ్తుంటే పక్కనే...
అలా ప్రయాణిస్తూ.. అండమాన్ చివరకు వెళ్లిపోగానే, అక్కడ సముద్రంలో ఉండే షిప్ పర్యాటకులతోపాటు, వాహనాలను కూడా ఎక్కించుకుని తుర్రుమంటుంది. షిప్‌లో ప్రయాణిస్తూ... కాసేపటికి సముద్రం మధ్యలో ఉండే బారాటంగ్ ఐలాండ్‌కు చేరుకోవచ్చు. ఈ ఐలాండ్‌కు అరగంట దూరంలో గల "లైమ్ స్టోన్ కేవ్స్" చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశంగా చెప్పవచ్చు.లైమ్ స్టోన్ కేవ్స్‌కు వెళ్లాలంటే బారాటంగ్ నుంచి షిప్‌లో అరగంటసేపు ప్రయాణించి.. అక్కడి నుంచి చిన్న చిన్న పడవల్లో ప్రయాణిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెళ్తున్నప్పుడు రెండువైపులా మాంగ్రోవ్ ఫారెస్ట్ (మడ అడవులు) దర్శనమిస్తాయి. అక్కడ దిగిన తరువాత ఒకటిన్నర కిలోమీటర్లపాటు లోపలికి నడచి వెళ్లాలి. అయితే ఈ గుహల్లోకి ఒకేసారి పదిమందికంటే ఎక్కువమంది వెళ్లకూడదు. ఒకవేళ వెళితే ఊపిరాడక ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఈ గుహల్లోకి వెళితే ఏదో తెలియని అనుభూతి దోబూచులాడుతుంది. గుహలోని ఏ భాగాన్ని తడిమినా నీరు మన చేతుల్ని తాకుతూ అలా సుతారంగా వెళ్లిపోతుంటుంది. గుహల పైభాగంలో ఉన్న చిన్న పగుళ్ల ద్వారా ఈ నీరు వస్తుంటుందట. ఇక్కడ తయారయ్యే కార్బన్ డై ఆక్సైడ్ కారణంగా నీరు రకరకాల ఆకారాల్లోకి మారుతుంది. ఇలా ఏర్పడ్డ ఒక్కో ఆకారం చేతితో చెక్కినంత అందంగా, కళ్లు తిప్పుకోనీయనంతగా ఉంటాయి.అండమాన్‌లోని హ్యావ్‌లాక్‌లో గల "రాధానగర్ బీచ్" ప్రపంచంలోనే నెంబర్ 7 బీచ్‌గా గుర్తింపు పొందింది. ఎలిఫెంట్ బీచ్ కూడా ఈ ద్వీపంలో తప్పక చూడాల్సిందే. కాలుష్యంలేని ఈ బీచ్‌లోని నీరు చాలా తేటగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ కోరల్‌రీఫ్స్‌ను చాలా బాగా చూడవచ్చు. ముఖాలకు మాస్కులను తగిలించుకుని సముద్ర గర్భంలో గల వింతలన్నింటినీ ఈ బీచ్‌లో స్పష్టంగా చూడవచ్చు. దీన్నే స్నార్కలింగ్ అని అంటుంటారు. ఈ స్నార్కలింగ్‌కు ఎలిఫెంట్ బీచ్ చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ బీచ్‌లో స్నార్కలింగ్ టీమ్ ఒకటి ఉంటుంది. వాళ్లే స్నార్కలింగ్ కిట్ ఇచ్చి మనల్ని సముద్రంలోకి తీసుకెళ్తుంటారు. ఒక పూట అంతా స్నార్కలింగ్ చేసే అవకాశం కల్పిస్తారు. వాళ్లిచ్చిన మాస్కులను పెట్టుకుని నడుచుకుంటూ.. పది అడుగుల లోతువరకూ వెళ్లి సముద్రంలోని అందాలను తనివితీరా చూడవచ్చు.
అలా సముద్రంలో నడచి వెళ్తుంటే.. రంగు రంగుల పువ్వులు, గుత్తులు గుత్తులుగా కోరల్స్, శంఖాలు, బంగారు వర్ణంలో చిత్రంగా మెరిసిపోయే చిన్న చిన్న చేపలు, వాటి తోకలపై నల్లటి చుక్కలు... ఇలా ఒకటేమిటి సముద్ర వింతలన్నింటినీ కళ్లారా చూడవచ్చు. ఆ అందాలన్నింటినీ చూశాక.. ఇది నిజమేనా..? అనుకుంటూ, మన కళ్లను మనమే నమ్మలేని పరిస్థితికి కొట్టుకుపోతాం.ఇక్కడ స్కూబా డైవింగ్ మరో ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. మన భుజాలకు ఎయిర్ సిలిండర్ తగిలించి సముద్రం మధ్యలోకి తీసుకెళ్లి షిప్ చివర్లో కూర్చోబెట్టి వెనక్కి తోసేస్తారు. అలా నీళ్లలో పడిపోయినవారు సముద్రంలో 25 మీటర్ల లోతుకు వెళ్లిపోతారు. అలా వెళ్తుంటే పక్క పక్కనే పెద్ద పెద్ద చేపలు వెళ్తూ కనిపిస్తాయి. అయితే ఈ డైవింగ్ చేయాలంటే నేవీ వాళ్లు నియమించిన కోచ్ వద్ద శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.అండమాన్‌లో చూడాల్సిన మరో ప్రదేశం "రెడ్‌స్కిన్ ఐలాండ్". ఇక్కడికి వెళ్లాలంటే.. మధ్యలో కొన్ని ప్రదేశాలు చెరువుల్లాగా కనిపిస్తాయి. అవన్నీ సునామీ వచ్చినప్పుడు మునిగిపోయాయట. కొన్ని ఎకరాల పొలాల్లోకి ఇసుక, ఉప్పునీరు వచ్చి నిల్వ ఉండిపోవటంతో.. అవి సాగు చేసేందుకు పనికిరాకుండా పోయాయి. దాంతో చిన్న చిన్న చెరువులుగా దర్శనమిస్తూ.. సునామీ విధ్వంసానికి సాక్షీభూతాల్లా మిగిలిపోయాయని గైడ్ చెప్పగానే మనసంతా భారమవకమానదు.బారాటంగ్‌కు 6 కిలోమీటర్ల దూరంలో గల "మడ్ వాల్‌కనో" కూడా చూడదగ్గ మరో ముఖ్యమైన ప్రదేశం. కొండలా ఉండేచోట అంతా బురద బురదగా ఉంటుంది. భూమిలోంచి రకరకాల వాయువులు వెలువడుతుండటంవల్ల బురద బుడగల మాదిరిగా పైకి లేచి బుగ్ బుగ్‌మంటూ చప్పుడు చేస్తూ ఉంటుంది. అదో ప్రకృతి విచిత్రం.అండమాన్‌లో ఇంకా చెప్పుకోదగిన, చూడదగ్గ పర్యాటక ప్రాంతాల విషయాలకొస్తే.. సన్‌సెట్ పాయింట్, అక్వేరియం, ఆంత్రోపోలాజికల్ మ్యూజియం, మినీ జూ, రాస్ ఐలాండ్, మరీనా పార్క్, సాముద్రిక నేవల్ మ్యూజియం, ఫారెస్ట్ మ్యూజియం, నార్త్ బే ఐలాండ్, మడివాల్కనో..లు ఉన్నాయి.అండమాన్‌లో పర్యటించేందుకు అక్టోబర్ నుంచి మే నెల వరకు అనువుగా ఉంటుంది. ఇక్కడికి ఎలా వెళ్లాలంటే.. విమానంలోగానీ, షిప్‌లోగానీ వెళ్లవచ్చు. వెళ్లేటప్పుడు షిప్‌లో వెళితే మరీ మంచిది. విశాఖపట్నం, చెన్నై, కలకత్తాల నుంచి అండమాన్ వెళ్లేందుకు షిప్స్ అందుబాటులో ఉన్నాయి.అయితే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి వద్ద కనీసం నెల రోజులకు ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదీ స్వయంగా వెళ్లి మన గుర్తింపు కార్డులు చూపించాకనే అది వీలుపడుతుంది. ఇక వాతావరణం అనుకూలంగా ఉంటేనే షిప్ ప్రయాణం బాగుంటుంది కాబట్టి ప్రయాణానికి రెండు రోజుల ముందుగానే బయల్దేరాల్సి ఉంటుంది. అయితే.. ఈ అండమాన్ ట్రిప్, పడవ ప్రయాణం నూతన దంపతులకయితే ఓ స్వర్గ సామ్రాజ్యాన్ని కళ్లముందు ఉంచుతుందంటే అతిశయోక్తి కాదు.