Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ అందానికి మణిపూస డాల్ఫిన్‌ పార్క్

Advertiesment
సముద్రపు ఆహ్లాదాన్ని

WD

హైదరాబాద్ (ఏజెన్సీ) , ఆదివారం, 3 జూన్ 2007 (18:05 IST)
సముద్రపు అందాలు ఒకవైపు పచ్చని అందాలతో అలరారే ప్రకృతి మరోవైపు చెరసి ఆహ్లాదాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందించే విశాఖ సోయగాల నడుమ మరో ఆణిముత్యం తోడుకానున్నది. నిన్నటి వరకూ కైలాసగిరి అందాలతో పరవశమవుతున్న విశాఖ వాసులకు కనువిందు చేయడానికి ఏళ్లతరబడి నిధుల గ్రహణంతో మూలపడిన డాల్ఫిన్‌ పార్క్ నిర్మాణానికి అధికారులు నిధులు మంజూరు చేయడం హర్షణీయం. విశాఖ - భీమిలి బీచ్‌ రోడ్డులో రాష్ర్ట అటవీశాఖ ఆధ్వర్యంలో `1987వ సంవత్సరంలో సాగర జలచర సామూహిక ప్రదర్శనాస్థలి' (మెరైన్‌ల్యాండ్‌ కాంప్లెక్స్) నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఆ మేరకు వంద ఎకరాల స్థలం సేకరించారు. ఇక్కడ డాల్ఫిన్‌, సీల్‌ చేపలతో పాటు సముద్రపు తాబేళు్ళ వంటి జలచరాలను పెంచడంతో పాటు వాటి సంతానాభివృద్ధికై కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. స్వర్గీయ ఎన్టీఆర్‌ హాయాంలో దీని నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.

ఆరంభశూరత్వం మాదిరిగా వెనువెంటనే ప్రహారీ, పూల్‌ వంటి నిర్మాణాలు జరిపినా ఆ తర్వాత నిధుల లేమితో ఈ ప్రాజెక్టు మూలపడింది. 1996లో సెంట్రల్‌ జూ అధారిటీ అధికారులు ఈ పార్‌‌కను పర్యవేక్షించి 26లక్షల రూపాయలు విడుదల చేయడానికి ప్రతిపాదించి, మ్యాచింగ్‌ గ్రాంటు కింద రాష్ర్ట ప్రభుత్వం మరో 26 లక్షల రూపాయలు ఇవ్వవలసిందిగా కోరారు. ఆ పరిస్థితిలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణపు పనులు ప్రారంభం కాలేదు. 1997లో దీని నిర్మాణానికి ప్రభుత్వ హామీ లభించడంతో `టెండర్లు' పిలిచినా, అనుకున్న సమయంలో నిధులు విడుదల కాక, పిలిచిన టెండర్లు రద్దు పరిచారు. 1998లో అసంపూర్తిగా నిర్మించిన ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం రెండు విడతలుగా రూ.3.25 లక్షలు విడుదల చేయడంతో ప్రహరీ నిర్మాణం పూర్తయింది.

డాల్ఫిన్‌ పార్క్ నిర్మాణానికి దాదాపు కోటి రూపాయలు వ్యయం కాగలదని గతంలో అధికారులు అంచనాలు వేసినా, ప్రస్తుత పరిస్థితిలో ఈ విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. డాల్ఫిన్‌ చేపల కోసం సముద్రం నుంచి నీరు ఫూల్‌లోనికి రావడం, బయటకు వెళ్ళేందుకు అవసరమైన సీ వాటర్‌ ఐన్‌టేక్‌ సిస్టమ్‌ నిర్మాణానికి సెంట్రల్‌ జూ అథారిటీ రూ.26 లక్షలు విడుదల చేయడంతో నిర్మాణంపై ఆశలు చిగురించాయి. ఇక్కడ డాల్ఫిన్‌ల పెంపకంపై తీసుకోవలసిన జాగ్రత్తలను స్వయంగా తెలుసుకునేందుకు `చెన్నై ' లో ఉన్న డాల్ఫిన్‌ కేంద్రానికి `జూ' అధికారులు వెళ్ళారు. అక్కడ ఇతర దేశాల నుంచి తెచ్చిన డాల్ఫిన్‌లు మరణించడం, దానికి గల కారణాలను కూడా వీరు అధ్యయనం చేశారు. విశాఖలో మాత్రం స్వదేశంలోని డాల్ఫిన్‌లనే పెంచడానికి సుముఖత వ్యక్తం చేశారు. అందుకు తగ్గ ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి డాల్ఫిన్‌ల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ర్త ప్రణాళికా నిధులతో పార్క్ పునరుద్ధరణకు అటవీశాఖాధికారులు ప్రతిపాదించడంతో నిర్మాణపు పనులు త్వరితగతిన సాగే అవకాశాలు ఏర్పడ్డాయి. దాదాపుగా దశాబ్ధకాలం పాటు ఎటువంటి ఆలనాపాలనా లేకపోవడంతో ఈ పార్క్ నేడు చెట్టూ చేమలతో నిండిపోయింది. ఇటీవల `క్లీన్‌ అండ్‌ గ్రీన్‌' కార్యక్రమం కింద పార్క్‌లో మొక్కలు నాటినా నీటిని సంరక్షించే నాధులు కానరావడం లేదు. ఉన్న వాచ్‌మెన్‌ విధి నిర్వహణ అంతంత మాత్రంగానే చేస్తుండడం ఒకింత ఊరట కలిగిస్తుంది. ఆదిలో పార్క్ నిర్మాణానికి వేసిన శిలాఫలకం కనుమరుగైపోయింది. వీటన్నింటిని అధికారులు పునరుద్ధరించవలసిన అవసరం వుంది. కైలాసగిరికి తోడుగా ఈ డాల్ఫిన్‌ పార్క్ నిర్మాణం పూర్తయితే విశాఖ వాసులతో పాటు పర్యాటకులకు కనువిందు చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

Share this Story:

Follow Webdunia telugu