గోవా పలోలెమ్ బీచ్ సందర్శన ఓ మధురానుభూతి
ప్రకృతి ప్రసాదించిన సహజమైన అందాలను చూసి మనసు పరవశిస్తుంది. నీలి ఆకాశం నుండి సందేశం తీసుకుని కిందికి దిగి తెల్లని ఇసుకను ముద్దాడేందుకు నిరంతరం తపన పడుతున్న సముద్రుణ్ణి చూస్తూ ఎన్ని గంటలైనా గడపగలిగిన అవకాశం ఇచ్చే ఏకైక బీచ్ పలోలెమ్ బీచ్.ఇది గోవాలోని అనేక సుందర బీచ్‌లలో మరింత సుందరమైనది. ఈ బీచ్‌లో ఒడ్డున కూర్చునే కాలం గడపాల్సిన పని ఎంతమాత్రం లేదు. కొంచెం సాహసం చేయగలిగితే జాలరి పడవ ఎక్కి సముద్రంలోని అలల మీద తేలుతూ వెళ్లి రాగలరు. ఈ బీచ్ సౌందర్యం భూమి మీదున్న మనకే కాదు, సముద్రంలో ఉండే డాల్ఫిన్స్‌కీ ఎంతో ఇష్టమైనదే. అందుకే ఈ బీచ్‌కి డాల్ఫిన్స్ తరచుగా వస్తుంటాయి. పడవ ప్రయాణంతో డాల్ఫిన్స్‌ని అతి సమీపం నుండి చూసే మహత్తర అవకాశం లభిస్తుంది. తగిన జోడు వెంటవుండి, చుట్టుకుపోతుంటే గోవాలో గడిపే ప్రతిక్షణం మధురంగా ఉంటుంది. ఎగిసిపడిన అలలు మనల్ని తాకే సమయంలో జంటలు హత్తుకుపోయి కలిసికట్టుగా ఆనందం పొందవచ్చు. గోవాలోని బీచ్‌లన్నీ కిటకిటలాడుతూనే ఉంటాయి. శని, ఆదివారాల్లో అయితే చెప్పనక్కరలేదు. కోరుకున్న ఏకాంతం దొరక్కపోయినా, ఎవరు ఏం చేస్తున్నారనేది పట్టించుకోని జనాభా అంతా అక్కడికి చేరతారు. బీచ్ లోనే బీచ్ హట్స్ ఉన్నాయి. అక్కడ మకాం చేయవచ్చు. పలు రకాల వస్తువులు గోవాలో మాత్రమే తయారయ్యే ఎథినిక్ ఆభరణాలు దొరుకుతాయి. సముద్రపు గవ్వలతో చేసే విలువైన ఆభరణాలు అవి.కొంకణ్ రైలుమార్గంలో కనకోన రైలు స్టేషన్‌లో దిగి మూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వస్తుంది పలోలెమ్ బీచ్. ఖర్చు అంతగా అవ్వని ట్రిప్ గోవా ఎంచక్కా కలిగిస్తుంది.