Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేతన్నల ఆరోగ్యమంటే అంత చులకనా...!

Advertiesment
నేతన్నల ఆరోగ్యమంటే అంత చులకనా...!
, సోమవారం, 22 సెప్టెంబరు 2008 (19:03 IST)
FileFILE
వార్త : చేనేత కార్మికుల చావులను ఆత్మహత్యలుగా చిత్రీకరించడం సరికాదని, సంవత్సరాల తరబడి రంగులు, రసాయనాలు, దుమ్ము, ధూళిలో పనిచేస్తున్నందున చేనేత కార్మికులు అనారోగ్యం బారిన పడి మరణించారని రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ మంత్రి హనుమంతరావు పేర్కొన్నారు.

చెవాకు : బాగానే ఉంది మంత్రి గారూ, కటిక దారిద్ర్యంతో అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న చేనేత కార్మికుల చావులు ఆత్మహత్యలు కాదనడం భేషుగ్గానే ఉంది. వయసు మళ్లక ముందు చావు అనారోగ్యంతోనో, ప్రమాదం, హత్య లేక ఆత్మహత్య ద్వారానో జరగాలి.

ఈ లెక్కన చూస్తే చిన్న వయసులోనే చేనేత కార్మికులు చనిపోవడానికి మీ అభిప్రాయం ప్రకారమైతే ఆత్మహత్య కారణం కాదు, అలాగే ప్రమాదం, హత్యలు జరగడంలేదు. కానీ అనారోగ్యం కారణంగానే వారు చనిపోయారనుకుంటున్నా వారి పరిస్థితికి కారణం ఎవరు?

మీరు చెప్పినట్టు సంవత్సరాల తరబడి రంగులు, రసాయనాలు, దుమ్ము, ధూళిలో పనిచేస్తున్నందున వారు అనారోగ్యం పాలవుతున్నారనుకుంటాం. అంటే వారి అనారోగ్యానికి కారణాలు తెలిసి కూడా వాటి నుంచి వారికి విముక్తి కల్పించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా.

మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా నాలుగేళ్లు దాటింది. ఇంకా కూడా వారి చావులు కొనసాగుతున్నాయంటే అందుకు మీరూ బాధ్యులే కదా. రాజీవ్ ఆరోగ్య శ్రీతో అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం అనారోగ్యం బారిన పడేందుకు అధిక అవకాశాలున్నట్టు చెబుతున్న చేనేత కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవచ్చుగా.

Share this Story:

Follow Webdunia telugu