వార్త : సినిమాలు చూసి జనం చెడిపోవద్దని, సినిమాల ద్వారా డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వస్తున్న వారికి అధికారమిస్తే మన మెడ మనమే కోసుకున్నట్లేనని రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలకు హితవు పలికారు.
చెవాకు : సినిమాల నుంచి వస్తున్న వారందరికీ ఇది వర్తిస్తుందా మంత్రివర్యా! ప్రధానంగా మీ పార్టీ తీర్థం పుచ్చుకున్న రాజశేఖర్, జీవిత దంపతులకూ వర్తిస్తుందా. అలాగే మీ పార్టీ తరపున గతంలో లోక్సభకు ఎన్నికైన కృష్ణకూ వర్తిస్తుందా.
సినిమాలలో బాగా డబ్బు సంపాదించిన వారిని నమ్మవద్దని చెబుతున్నారు బాగానే ఉంది కానీ రాజకీయాల్లో సంపాదించే వారిని నమ్మి మాత్రం ప్రజలు గొంతుకోసుకోవడంలేదా ఏమిటి?
గతంలో ఓ సినీ నటుడికిచ్చాం. పేదలకు సేవ చేయడంలో ఆయనను మించిన వారు ఇప్పటివరకు లేరని మీ పార్టీలో వారు కూడా చెబుతున్నారు. సేవ చేసే వాడు ఏ రంగం నుంచి వచ్చిన వాడైనా సేవ చేస్తాడు, స్వాహా చేసేవాడు ఎక్కడ ఉన్నా స్వాహా చేస్తాడనే విషయం మరి మీకు తెలియదా.