వార్త: తెరాస తమకు మిత్రపక్షమేనని, అణు ఒప్పందాన్ని వ్యతిరేకించే విషయంలో ఆ పార్టీతో చేతులు కలిపేందుకు తమకు అభ్యంతరం లేదని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎర్రన్నాయుడు అన్నారు.
చెవాకు: అవున్లెండి అవసరాలు ఎలాగైనా మాట్లాడిస్తాయి. గతంలో మీ పార్టీ రాజకీయాలకు భయపడి వెళ్లిన కేసీఆర్ సహకారం ఖచ్చితంగా అవసరమనే విషయాన్ని ఇప్పటికైనా అంగీకరించారు. ఇంతకాలం తిట్టుకున్నా....ఇద్దరికీ ఇపుడు ఒకరి తోడు ఒకరికి కావాల్సివచ్చింది కాబట్టే ఈ అడుగులు పడుతున్నాయేమో. లేకుంటే గౌడ్ బయటకు వెళ్లేంతవరకు తెలంగాణపై అనుకూలంగా మాట్లాడని మీరు ఇపుడు ఏకంగా ఆ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధమంటున్నారంటే ఏమనాలి.
ఎలాగూ చిరు పార్టీ వస్తే కోస్తాలో పెద్ద దెబ్బ తగులుతుందని తెలుసుకునే ఇలా వ్యూహం మార్చారా. బీఎస్పీ నేతృత్వానికి అంగీకరించడం ద్వారా అటు తెరాసను, కమ్యూనిస్టులను మచ్చిక చేసుకుని గత పర్యాయం కాంగ్రెస్ చేసిన తరహాలో డబుల్ గోల్ కొట్టాలనే మీ వ్యూహం మంచిదే కానీ ఈ ప్రయత్నం మిమ్మల్ని మేజిక్ మార్కు వరకు తీసుకెళుతుందా అన్నదే అందరి అనుమానం.