'సింగపూర్ సూరిబాబు... కొడుకు మండలేష్'- నవ్యాంధ్ర రాజధానిపై కత్తి మహేష్ సెటైర్
హైదరాబాద్ : నవ్యాంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ రియల్ దందా చేస్తున్నారని విమర్శిస్తూ, కత్తి మహేష్ ఓ పొలిటికల్ సెటైరిక్ సినిమా తీస్తున్నాడట. దాని కథను ఆయనే వివరించాడు కూడా. నూతన్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ’సింగపూర్’ సూరిబ
హైదరాబాద్ : నవ్యాంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ రియల్ దందా చేస్తున్నారని విమర్శిస్తూ, కత్తి మహేష్ ఓ పొలిటికల్ సెటైరిక్ సినిమా తీస్తున్నాడట. దాని కథను ఆయనే వివరించాడు కూడా.
నూతన్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ’సింగపూర్’ సూరిబాబుని రైతు సరోజమ్మ, స్టూడెంట్ లీడర్ తేజ, స్కూల్ ప్యూన్ కేశవులు కిడ్నాప్ చెయ్యడానికి ప్లాన్ చేస్తారు. ఎన్నికల్లో ప్రామిస్ చేసినట్టుగా రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చెయ్యకుండా భర్త ఆత్మహత్యకు కారణమయ్యాడని సరోజమ్మకు సూరిబాబు అంటే కోపం. ఇంటికో ఉద్యోగమన్న సూరిబాబు స్లోగన్‌తో ఫ్లాట్ అయిన తేజ, తన ఒంటికి కూడా ఉద్యోగం ఒస్తుందనే ఆశతో ఇంటింటికీ తిరిగి ఓట్లేయించాడు.
కానీ, రాష్ట్రంలో ఒక్కటి కూడా కొత్త ఉద్యోగం సృష్టించకపోగా, ఉన్న జీవనోపాధుల్ని కూడా పోగొడుతున్న సూరిబాబంటే పరమ కసి తేజకు. స్కూల్ ప్యూన్ అయినా, ఫీజ్ రీయింబర్సుమెంట్ పుణ్యమా అని పిల్లల్ని ఇంజనీరింగ్, మెడిసన్ చదివిస్తున్నాడు కేశవులు. ఎన్నికలయ్యాక ఈ విషయంలో సూరిబాబు ఏ నిర్ణయమూ తీసుకోని కారణంగా పిల్ల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుందనే భయంతో సూరిబాబంటే అసహ్యాన్ని పెంచుకున్నాడు కేశవులు.
ఈ ముగ్గురికీ ఉన్నది ఒక్కో ఎకరం పొలం. ఇప్పుడు అది కూడా కొత్త రాజధాని కోసం లాక్కుంటున్న సూరిబాబుని ఏదో ఒకటి చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు. నవ్యాంధ్ర రాజధానిని సింగపూర్ చెయ్యాలని పట్టుబట్టి పొలాలు లాక్కొనే పనిలో భాగంగా గెస్ట్ హౌస్‌లో ఉన్న సూరిబాబుని తెలివిగా కిడ్నాప్ చేస్తారు. కిడ్నాపింగ్‌లో జరిగిన చిన్న యాక్సిడెంట్ కారణంగా ’సింగపూర్’ సూరిబాబుకి టెంపరరీ మెమరీ లాస్ వస్తుంది. రివెంజ్ తీర్చుకుందామనుకుంటే అసలు మెమరీనే లేని సూరిబాబు చేతిలోకి వచ్చేసరికీ సరోజమ్మ-తేజ-కేశవులుకు ఏం చెయ్యాలో అర్థంకాదు. సేఫ్టీ కోసం అతని గడ్డం తీసేసి రూపురేఖలు కొంత మారుస్తారు.
ముఖ్యమంత్రి మిస్ అయ్యాడని తెలిస్తే అల్లరి అయిపోవడంతోపాటూ కార్పొరేట్ లాబీ తన సపోర్ట్ ఎక్కడ లాగేసుకుంటుందో అనే భయంతో సూరిబాబు కొడుకు మండలేష్... లేని సూరిబాబు గెస్ట్ హౌస్‌లోనే ఉన్నట్టుగా నాటకం మొదలుపెడతాడు. మెమరీ లేని సూరిబాబుని బాగు చెయ్యడానికి తేజ తన సైక్రియాటిస్ట్ గర్ల్ ఫ్రెండ్ ప్రియ హెల్ప్ అడుగుతాడు. ప్రియ థెరపీలో జరిగే ఫన్నీ మిస్టేక్ వల్ల సూరిబాబు తనని తాను భూమి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న రైతు రాజయ్య అనుకుంటాడు.
సింగపూర్ సూరిబాబు విధానాలకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనని తాను రాజయ్య అనుకుంటున్న సూరిబాబే ఉద్యమం లేవదీస్తాడు. సరోజమ్మ-తేజ-కేశవులు క్రియాశీలకంగా ఆ ఉద్యమంలో భాగం అవుతారు. గెస్ట్ హౌస్‌లో లేని సూరిబాబుని ఉన్నాడని నమ్మిస్తూ మండలేష్ తనే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. రాజయ్యలా ఉద్యమం చేస్తున్న సూరిబాబుని చంపించే ప్రయత్నంలో తండ్రి అనే నిజం తెలిసినా చంపెయ్యడానికే మండలేష్ ట్రై చేస్తాడు. చివర్లో మెమరీ రికవర్ అయ్యిన ’సింగపూర్’ సూరిబాబు తన తప్పు తెలుసుకుంటాడా? లేదా ! అనేది కథ. ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని తనయుడు లోకేష్ అక్రమాలపై సినిమా తీస్తున్నానని మహేష్ ప్రకటించాడు. పెసరట్టు అనే సినిమా తీసి చేతులు కాల్చుకున్న కత్తి మహేష్ ఇపుడు చంద్రబాబు అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సేకరించిన వైనంపై కత్తి కడుతున్నాడు. మరి ఈ సినిమా వస్తుందో రాదో వెయిట్ అండ్ సీ.