వార్త: కాంగ్రెస్కు తామే ప్రత్యామ్యాయమని ప్రజారాజ్యం ప్రతినిధులు కార్యాలయం లోపలి నుంచి చెప్పుకుంటే సరిపోదని దుయ్యబట్టిన టీడీపీపీ నేత ఎర్రన్నాయుడు టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రజలకోసమే పని చేస్తోందనే విషయాన్ని ప్రజలు గుర్తించారనే విషయం మీకోసం యాత్రలో స్పష్టమైందన్నారు.
చెవాకు: భలే తమాషాగా ఉంది నాయుడు గారూ! ప్రజాసేవకోసమే మీ పార్టీ పుట్టిందనేంత వరకు బాగానే ఉంది కానీ ప్రజల కోసమే మీరు పార్టీ నడుపుతున్నారని చెప్పడం ఏ మంత బాగోలేదండి. దానిని ప్రజలు కూడా గుర్తించారంటున్నారు మరి మీరెందుకు గత ఎన్నికల్లో ఓడినట్టు?
అంటే ఓ రకంగా మెజారిటీ ప్రజలు మిమ్మల్ని కాదన్నట్టేగా. అధికార పార్టీగా ఉన్నందున అక్రమాలకు పాల్పడింది అని కాంగ్రెస్ను విమర్శించే ఛాన్స్ కూడా అప్పట్లో మీకు లేదు.
రాజకీయాల్లో సవాళ్లు విసరడానికి, విమర్శలు గుప్పించడానికి బహిరంగ సభలు, ఆందోళనలే అవసరం లేదు. ఎక్కడి నుంచైనా చేయవచ్చని మీకు తెలియదా. అయితే మీతో ఒక్క విషయంలో ఏకీభవించవచ్చు.
ఏదిబడితే అది నమ్మడానికి ప్రజలు చెవుల్లో పువ్వులు పెట్టుకోలేదని చెప్పారే. ఆ ఒక్క ముక్క చాలా ముద్దొస్తుంది. అంటే మీరు ఇచ్చే ఉచిత హామీలను, చేసే విమర్శలను ప్రజలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారన్న మాట. ఇక చూద్దాం తెలివైన వారని మీరు చెబుతున్న ఓటర్ల నిర్ణయం ఎలా ఉంటుందో వచ్చే ఎన్నికల్లో చూద్దాం.