వార్త : గత పర్యాయం లాగే వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలో యూపీఏ సర్కారు ఏర్పడటంలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషించనుందని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.
చెవాకు : అంటే...ఒకవేళ మీరు మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా గత పర్యాయంలాగే రాష్ట్రానికి మొండి చెయ్యి చూపిస్తారన్నమాట. 2004 ఎన్నికల్లో అంత గొప్ప విజయాన్ని మీ పార్టీకి అందిస్తే మీరు రాష్ట్రానికి చేసిందేమిటి?
ఒక్కటంటే ఒక్క క్యాబినెట్ మంత్రి పదవిని జైపాల్ రెడ్డికి అప్పగించి చేతులు దులుపుకున్నారు. మిగిలిన వారికిచ్చిందంతా సహాయ మంత్రి స్థాయి పదవులే. పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు అన్ని కీలక పదవులిచ్చి రాష్ట్రంలో మాత్రం ఒక్క క్యాబినెట్ మంత్రి పదవిని ఇవ్వడం న్యాయమనిపించిందా?
తమిళనాడు నుంచి ఎంపికైన వారికి ఆర్థిక, వైద్య, షిప్పింగ్, రహదారుల శాఖ, కమ్యూనికేషన్లు, ఐటీ, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖల్లో మంత్రి పదవులను క్యాబినెట్ హోదాతో అప్పగించారనే విషయం ఎవ్వరికీ తెలియదనుకుంటున్నారా?
అయినా ఈ సారి గెలుపు గత పర్యాయంలా అంత సులువేం కాదన్న విషయం మీకు మాత్రం తెలియదా ఏంటి? అప్పట్లో టీడీపీ వ్యతిరేకత, తెరాసతో పొత్తు మీకు లాభించగా, ఈ దఫా వాటితోపాటు మీతో తలపడేందుకు ప్రజారాజ్యం కూడా ముందుకు వచ్చినందున పోటీ కాస్త కఠినంగానే ఉంటుందిలే.