Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెలికత్తెల మధ్య రాకుమార్తెలా వస్తున్న "సంక్రాంతి"కి స్వాగతం

చెలికత్తెల మధ్య రాకుమార్తెలా వస్తున్న
WD
"బంతి పూవులు లేత నవ్వులతో సంక్రాంతి సుందరి సాగి వచ్చింది
తెలుగు పల్లెలు నిద్రలేచాయి వెలుగులో కనువిచ్చి చూచాయి సంక్రాంతి వేళ"- అని అభ్యుదయ కవి దాశరథి పులకించి పాడిన చందంగా మకర సంక్రాంతికి ఏటికేడాది కష్టించి పండించిన పంటలు ఇళ్ళకు చేరే సమయం ధాన్యలక్ష్మికి స్వాగతం చెప్పడానికి ఇళ్ల ముంగిట రంగు రంగుల ముగ్గులతో స్వాగతం పలుకుతాం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ముగ్గుల్లో గొబ్బెమ్మలను పూలతో అలంకరించి పాటలు పాడతారు.

సంక్రాంతికి ముందు నెల రోజుల పాటు ముగ్గులు పెట్టడం, సంక్రాంతి సుందరికి గంగిరెద్దుల ఆటతో స్వాగతం పలకడం ఇప్పటికీ మన రాష్ట్రంలో ఎంతో కనువిందు చేస్తున్నాయి.

'ఇంకా సుబ్బీ గొబ్బెమ్మా సుఖములియ్యవే తామరపువ్వంటి తమ్ముణ్ణియ్యవే
చేమంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే మొగిలిపువ్వంటి మొగుణ్ణియ్యవే' అంటూ కన్నెపిల్లలు పాటలు పాడుతూ గొబ్బెమ్మలకు పూజ చేస్తారు. ప్రాచీన జానపదుల నుంచి నేటికీ సంప్రదాయంగా జరుపుకోనే పండుగే మకర సంక్రాంతి.

సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరించబడుతోంది. ఇలా సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు. పుష్యమాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన ఈ పుణ్యదినం మకర సంక్రాంతి నాడు దాన ధర్మాలు చేస్తే మోక్షం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు.

సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో కర్కాటక సంక్రమణం చేస్తే అది దక్షిణాయనంగా, సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించేవరకు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే భీష్ముడు నిరీక్షించి తుదిశ్వాస విడిచారని పురాణాలు చెబుతున్నాయి.

ఇంకా ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది. కనుకనే దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందమని పురోహితులు సూచిస్తున్నారు. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది.

అందుకే దక్షిణాయనంలో అంపశయ్య మీద పడిన బీష్ముడు.. ఉత్తరాయణ పుణ్యకాలములో స్వచ్ఛంద మరణాన్ని కోరుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలము పితృదేవతల ఆరాధనా పుణ్యకాలంగా కూడా వ్యవహరిస్తారు. ఇలా సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన పుణ్యదినాన్ని మకర సంక్రాంతిగా పిలుస్తున్నారు.

ఈ సంక్రాంతి ఒంటరిగా రాదని, మహారాణిలా ముందు "భోగి"ని వెనుక "కనుమ"ను వెంటబెట్టుకుని చెలికెత్తల మధ్య రాకుమార్తెలా వస్తుందని ప్రతీతి. అట్టి సంక్రాంతి రోజున తమ శక్తికి తగిన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.

అలాగే స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం వల్ల సకల సంపదలతో పాటు చక్కని సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. ఇంకా సంక్రాంతి రోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి శుభాశీస్సులతో.. వారి వారి వంశాలు వర్ధిల్లుతాయని పండితులు అంటున్నారు. మరి మీరు కూడా మీ శక్తి తగినట్లు దాన ధర్మాలు చేసి సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకుంటారు కదూ..!?

Share this Story:

Follow Webdunia telugu