గంగానది భూమికి వచ్చిన రోజే మకర సంక్రాంతి!
, బుధవారం, 12 జనవరి 2011 (15:41 IST)
పవిత్ర గంగానది భూమిక వచ్చిన రోజే మకర సంక్రాంతి. సాగర రాజు (60) వేల పుత్రులు కపిల మహర్షి శాపానికి గురై భాస్మములుగా మారినప్పుడు, వారి వారసుడు భగీరథుడు తన పితృ దేవతలకు విముక్తి కలగడానికి గంగా నదిని భూమి మీదకు తేవడానికి మహా తపస్సుచేస్తాడు. మకర సంక్రమణం జరిగిన రోజున గంగా నది భూమిమీద ప్రవహించి వారి భస్మములకు ఉత్తమగతులు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా మకర సంక్రాతి రోజునే శ్రీ మహావిష్ణువు అసురులను మంధర పర్వతం కింద పూడ్చి, ధర్మస్థాపన చేశాడు. అలాగే ద్వాపర యుగంలో, మహాభారతంలో భీష్మ పితామహుడు “ఇఛ్ఛామృత్యువు” వరం వలన అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ప్రాణంవిడుస్తాడు. ఆ రకంగా పరమాత్మలో లీనమయ్యాడు. ఇంకా చెప్పాలంటే మకర సంక్రాంతి రోజున వసంత ఋతువు ప్రారంభమవుతుంది. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ రోజునుండి దినము ఎక్కువ కాలం, రాత్రి తక్కువకాలం ఉంటుంది. చలి తగ్గి మెల్లగా వసంతం మొదలవుతుంది. ఉపమానంగా సూర్యుడు చీకటిని పారద్రోలి వెలుగు ప్రసాదిస్తాడని పురోహితులు చెబుతున్నారు.