Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లీడు అమ్మాయిలు ధనుర్మాసంలో విష్ణువును పూజిస్తే...

Advertiesment
Dhanurmasam 2021-2022
, బుధవారం, 15 డిశెంబరు 2021 (22:29 IST)
సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. ఇది సరిగ్గా మకర సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే ప్రారంభమవుతుంది. భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది “ధనుర్మాసము”. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ, అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది.

 
ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయమాడిందనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. సాక్షాత్‌ భూదేవి, అవతారమూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ‘తిరు’ అంటే మంగళకరమైన అని , ‘పావై’ అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది. 

 
ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లీడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.

 
ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెల్పుతున్నాయి. 

 
ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాధలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈ నెలరోజుల పాటూ ఈ వ్రతాన్ని చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు.

 
ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతో, జంగమ దేవరలతో, గంగిరెద్దులను ఆడించేవారితోనూ సందడిగా వుంటుంది. ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గులతో కనుల విందుగా వుంటాయి. ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతు ల సంభారాలతో పల్లెలు సంక్రాంతి పండుగ కోసం యెదురుచూస్తూ వుంటాయి. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని చెప్పబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి..!