భోగి మంటల పరమార్థం ఏమిటో తెలుసా?
, శనివారం, 12 జనవరి 2013 (18:17 IST)
సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున "భోగి" పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు. భోగిరోజున తెల్లవారకముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వెలిగిస్తారు. ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు, చెక్కముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు. భోగి మంటల పరమార్థం ఏమిటంటే... ఆ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు.ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు.దీనికి ప్రతిగా వారంతా రేగిపళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు. రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు.