Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంక్రాంతి తినుబండారాల రుచే వేరుకదయా...!

Advertiesment
ఇతరాలు వెబ్దునియా స్పెషల్ 2009 మకర సంక్రాంతి తినుబండారాలు రుచి అరిసెలు బొబ్బట్లు జంతికలు సాకినాలు పాలతాలుకలు సేమియాపాయసం పరమాన్నం పులిహోర గారెలు
సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు, జంతికలు, సాకినాలు, పాలతాలుకలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ప్రతి ఇంటా చేసుకునే తినుబండారాలను బంధుమిత్రులకు, సన్నిహితులకు ఇచ్చి సంతోషిస్తారు.

ఇంకా చెప్పాలంటే... సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ప్రతీ సంక్రమణానికీ పితృ తర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇవ్వాలని పురాణాలు చెబుతున్నాయి.

సంక్రాంతి రోజులలో మనము చూసే సుందర దృశ్యం.. ఏమిటంటే..? అందరికీ తెలిసిందే... గంగిరెద్దుల ఆటలు. గంగిరెద్దులవారు... గంగిరెద్దులను చక్కగా అలంకరించి ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి.

ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం చేస్తాయి. "అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు" అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని భిక్షంగా స్వీకరిస్తూ కనిపిస్తారు.

మరోవైపు.. "హరిలో.. రంగ... హరీ" అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.

ఇంకేముంది...? సంక్రాంతిని భలే హుషారుగా జరుపుకోండి.. బంధుమిత్రులను, సన్నిహితులను మీ ఇంటికి ఆహ్వానించి.. ఆనందోత్సాహాలతో ఈ పర్వదినాన్ని గడుపుకోండి... అందరికీ... మకరసంక్రాంతి శుభాకాంక్షలు...!

Share this Story:

Follow Webdunia telugu