Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్‌కు తీపి-చేదు కలయికగా 2009 సంవత్సరం!

Advertiesment
2009 సంవత్సరం

PNR

, సోమవారం, 28 డిశెంబరు 2009 (14:58 IST)
File
FILE
125వ వ్యవస్థాపక దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి 2009 సంవత్సరం తీపి, చేదు కలయికగా మిగిలిపోనుంది. ఈ యేడాది ఆగస్టు నెల వరకు ఆ పార్టీకి అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణంతో చిక్కులు ఎదురయ్యాయని ఒకరకంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు కాంగ్రెస్ అధిష్టానం స్వయం తప్పిదాలు, ధరల పెరుగుదల, తెలంగాణ అంశాలు ఆ పార్టీకి లేనిపోని తలవంపులు తెచ్చిపెట్టాయి.

ఈ యేడాదిలో ఆ పార్టీ ఆశాజ్యోతిగా భావిస్తున్న యువరాజు రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. దేశానికి గుండెకాయలాంటి ఉత్తరప్రదేశ్‌లో పార్టీకి తిరిగి పునర్జీవం కల్పించారు. ఫలితంగా ఈ యేడాది మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని విజయాన్ని దక్కించుకుంది.

18 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ 200 పైచిలుకు స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ విషయంలో అటు రాహుల్ గాంధీ, ఇటు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కృషి ప్రశంసనీయం. పార్టీకి తిరుగులేని విజయాన్ని చేకూర్చి పెట్టడంలో వీరిద్దరి కృషితో పాటు.. ఆర్థికవేత్త, ప్రధాని మన్మోహన్ సింగ్ సమర్థవంతమైన పాలన ఎంతగానో దోహదపడింది.

బలహీన ప్రధాని అంటూ ప్రతిపక్షనేత అద్వానీతో పదేపదే విమర్శలను ఎదుర్కొన్న మన్మోహన్.. ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజేతగా నిలిచి, పటిష్టమైన ప్రధానిగా తిరిగి రెండో సారి ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయభేరీ మోగించింది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
webdunia
File
FILE


నిత్యావసర ధరలు ఆకాశానికి తాకి పేద, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్న తరుణంలో కూడా ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కడం గమనార్హం. ఇంతవరకు ఆ పార్టీకి అన్నీ సక్రమంగానే అనుకూలించాయి. 2008 నవంబరు 26వ తేదీన జరిగిన ముంబై దాడుల అనంతరం కాంగ్రెస్ పాలనపై విమర్శలు వెల్లువెత్తినా వాటిని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా సార్వత్రికంతో పాటు.. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో పట్టం కట్టారు. ఇంతవరకు కాంగ్రెస్‌కు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి.

గత సెప్టెంబరు రెండో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజానేత వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలయ్యారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి చిక్కులు ఎదురుకావడం ప్రారంభమయ్యాయి. వైఎస్ దుర్మరణంతో రాష్ట్రంలో కల్లోల వాతావరణం నెలకొంది. వైఎస్ వారసుని ఎంపికపై ప్రతిష్టంభన ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది.

ఇంతలోనే తెలంగాణ సమస్య తెరపైకి వచ్చింది. అఖిలపక్షం తీర్మానం మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి రోశయ్య పచ్చజెండా ఊపారు. ఆ వెనువెంటనే కేంద్రం సానుకూల ప్రకటన చేసింది. దీనిపై రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజానీకంలో ఒక్కసారి ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి. మాటమాత్రం సంప్రదించకుండా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై పార్టీలకతీతంగా నేతలంతా ముక్తకంఠంతో ఖండించారు.

చివరకు యూపీఏ ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలైన డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీలు కూడా కాంగ్రెస్ పెద్దలను నిందించాయి. ఈ ప్రకటనతోనే దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు పుట్టుకొచ్చాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి మరో అడుగు ముందుకేసి యూపీని మూడు ముక్కలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు.

webdunia
File
FILE
ముఖ్యంగా, మాయావతి చేసిన ప్రకటన కాంగ్రెస్‌కు ఆశనిపాతం లాంటిందే. గత దశాబ్దకాలంగా పట్టుకోల్పోయి ఇప్పుడిపుడే కోలుకుంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలా ఉంది. అలాగే, యూపీలో రాహుల్ గాంధీకి చెక్ పెట్టేందుకు మాయావతి పన్నిన పన్నాగంలో చిక్కుకోకుండా కాంగ్రెస్ వ్యవహరించాల్సి ఉంది. ఇకపోతే.. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధిక స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోవడం కూడా ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలాంటిదే.

దీనికి తోడు, సాతంత్ర్య సమరయోధుడు, మంచి అనుభవశీలి, రాజనీతిజ్ఞుడుగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నారాయణ్ దత్ తివారీ (ఎన్డీ.తివారీ) రాసలీలల వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలవంపులు తెచ్చిపెట్టాయి. వీటితో పాటు... ధరల పెరుగుదల అంశం కూడా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. 125వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి 2009 సంవత్సరం తీపి, చేదు కలయికగా మిగిలిపోనుంది. అదేసమయంలో వచ్చే యేడాది ఆరంభంలో జరుగనున్న బీహార్ శాసనసభ ఎన్నికలు ఆ పార్టీకి తొలి అగ్నిపరీక్షగా మారనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu